SL vs PAK: సొంతగడ్డపై ఫైనల్లో పాకిస్థాన్‌కు పరాభవం.. శ్రీలంకకు థ్రిల్లింగ్ విక్టరీ అందించిన చమీర

SL vs PAK: సొంతగడ్డపై ఫైనల్లో పాకిస్థాన్‌కు పరాభవం.. శ్రీలంకకు థ్రిల్లింగ్ విక్టరీ అందించిన చమీర

ట్రై సిరీస్ టైటిల్ ను శ్రీలంక గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ పై 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి విజేతగా నిలిచింది. గురువారం (నవంబర్ 27) రావల్పిండి వేదికగా జరిగిన ఈ ఫైనల్లో శ్రీలంకను చమీర గెలిపించాడు. మొదట బ్యాటింగ్ లో కామిల్ మిశ్రా 76 పరుగులు చేసి భారీ స్కోర్ అందించగా.. ఛేజింగ్ లో చమీర (4/20) అద్భుతమైన స్పెల్ తో పాకిస్థాన్ ఓటమికి కారణమయ్యాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులకు పరిమితమైంది.  

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరంభంలోనే నిస్సంక (8) వికెట్ కోల్పోయింది. ఈ దశలో కుశాల్ మెండీస్, కామిల్ మిశ్రా జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఒక వైపు వేగంగా ఆడుతూనే మరో వైపు వికెట్ కాపాడుకున్నారు. రెండో వికెట్ కు 66 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. కుశాల్ 23 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. కామిల్ మిశ్రా (76) మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లియాంగే (24) నిదానంగా ఆడినా చివర్లో శనక (17) మెరుపులు మెరిపించాడు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 

ఛేజింగ్ లో పాకిస్థాన్ కు ఘోరమైన ఆరంభం లభించింది. పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన అసాధారణ బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు.ఉస్మాన్ ఖాన్ (33), మహమ్మద్ నవాజ్ లతో కలిసి కీలక బాగస్వామ్యాలను ఏర్పరిచాడు. ఈ క్రమంలో అఘా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో జట్టు విజయానికి 10 పరుగులు అవసరం కావడంతో చమీర కేవలం మూడే పరుగులు ఇచ్చాడు. దీంతో శ్రీలంక 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.