WBBL 2025: ఇంత కంటే బ్యాడ్ లక్ ఉండదు: 13 బంతుల్లో 3 పరుగులు.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

WBBL 2025: ఇంత కంటే బ్యాడ్ లక్ ఉండదు: 13 బంతుల్లో 3 పరుగులు.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

క్రికెట్ లో వర్షం కారణంగా కొన్ని జట్లకు తీవ్ర నిరాశ తప్పదు. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో వరుణుడు అడ్డు పడితే విజయం సాధించాల్సిన జట్టుకు చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు క్రికెట్ లో చాలానే జరిగాయి. తాజాగా మహిళల బిగ్ బాష్ లీగ్ లో వర్షం ఒక జట్టును ముంచేసింది. శుక్రవారం (నవంబర్ 28) అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్, సిడ్నీ థండర్ ఉమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ కారణంగా 5 ఓవర్లకే కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. 

సూపర్ ఫామ్ లో ఉన్న లారా వోల్వార్డ్ట్ 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. చివర్లో తాహిళ మెగ్రాత్ 2 ఫోర్లతో 6 బంతుల్లో 12 పరుగులు చేసింది. 46 పరుగుల ఛేజింగ్ లో బరిలోకి దిగిన సిడ్నీ థండర్ 2.5 ఓవర్లలోనే 43 పరుగులు చేసి గెలుపుకు దగ్గరగా వచ్చింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 15 బంతుల్లోనే 8 ఫోర్లతో 38 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. సిడ్నీ విజయానికి 13 బంతుల్లో 3 పరుగులు చేస్తే చాలు. ఈ దశలో సిడ్నీ విజయంపై ఎవరికీ అనుమానాలు లేవు. అయితే దురదృష్టం ఆ జట్టును వెంటాడింది. 

13 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో చిన్న చినుకులు పడ్డాయి. భారీ వర్ష సూచనలు ఉండడంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. పెద్దగా వర్షం పడకపోయినా అంపైర్లు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డగౌట్ లో ఉన్న సిడ్నీ ప్లేయర్స్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయ్యారు. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో విజయం సిడ్నీకి చాలా కీలకం. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ మాత్రమే వారి ఖాతాలో చేరింది. ప్రస్తుతం  అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ 7 మ్యాచ్ ల్లో 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. సిడ్నీ థండర్ ఉమెన్ 7 మ్యాచ్ ల్లో 5 పాయింట్లతో 7 వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.