WPL మెగా వేలంలో సంచలనం.. ఇండియన్ స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్ అన్‎సోల్డ్

WPL మెగా వేలంలో  సంచలనం.. ఇండియన్ స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్ అన్‎సోల్డ్

న్యూఢిల్లీ: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మెగా వేలంలో సంచలనం నమోదైంది. టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్ వేలంలో అన్ సోల్డ్‎గా మిగిలిపోయింది. రూ.10 లక్షల బేస్ ప్రైజ్‎తో ఆక్షన్‎లో వచ్చిన ప్రతీకా రావల్‎ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‎ 2025లో అద్భుతంగా రాణించిన ప్రతీకా‎ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. 

అయితే.. డబ్ల్యూపీఎల్ ఆక్షన్‎లో ప్రతీకా అన్ సోల్డ్‎గా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఆమె గాయమేనని తెలుస్తోంది. వరల్డ్ కప్‎లో ఫీల్డింగ్ చేస్తూ ఈ ఇండియా ఓపెనర్ గాయపడిన విషయం తెలిసిందే. కాలికి తీవ్రమైన గాయంతో కావడంతో టోర్నీ మధ్యలోనే ప్రతీకా నిష్క్రమించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆమె పూర్తిగా కోలుకునేసరికి సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రతీకాను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
వన్డే వరల్డ్ కప్‎లో భాగంగా 2025, అక్టోబర్ 26న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‎తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ ప్రతీకా రావల్ గాయపడింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో గ్రౌండ్‎లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది. 

టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ గాయం కారణంగా కీలకమైన నాకౌట్ మ్యాచులకు దూరమైంది. వరల్డ్ కప్‎లో మొత్తం 7 మ్యాచ్‎లాడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్‎తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‎లో సెంచరీ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. కానీ గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి వైదొలిగింది.