
ఆర్మూర్, వెలుగు: సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకే ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్ లోని పీవీఆర్ భవన్ లో మీడియాతో వారు మాట్లాడారు. ఆగస్టు 2న అలూర్ మండల కేంద్రం నుంచి గగ్గుపల్లి, ఇస్సాపల్లి గ్రామాల మీదుగా ఆలూర్ రోడ్డు నుంచి శివాజీ చౌక్ మీదుగా పాత బస్టాండ్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 3న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్మూర్‌టౌన్ లోని పాత బస్టాండ్ లో శ్రమదానం కార్యక్రమం ఉంటుందన్నారు.
అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఉంటుందన్నారు. పాదయాత్రలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, బాల్కొండ ఇన్చార్జి సునీల్ రెడ్డి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్ను పాల్గొన్నారు.