- ఇండియాను ‘ఒకే మతం’గా మార్చే ప్లాన్: ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి
- ఆర్ఎస్ఎస్ వందేండ్ల ఎజెండా ఇదే..
- కలిసికట్టుగా పోరాడాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: దేశాన్ని మతతత్వ రాజ్యంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి అన్నారు. రాజ్యాంగ విలువలన్నింటినీ తుంగలో తొక్కి.. ‘ఒకే దేశం– ఒకే మతం’ అనే నినాదాన్ని జనంపై రుద్దుతోందన్నారు. వందేండ్లు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్.. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీలందరినీ దేశం నుంచి తరిమేయాలనే డేంజర్ ఎజెండాను అమలు చేస్తున్నదని ఆరోపించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఐద్వా మహాసభల సందర్భంగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, జాయింట్ సెక్రటరీ అర్చన, తెలంగాణ స్టేట్ సెక్రటరీ మల్లు లక్ష్మీతో కలిసి పీకే శ్రీమతి సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ పాలనలో మైనారిటీల ఉనికికే ముప్పు వాటిల్లుతున్నది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కుకే బీజేపీ ఎసరు పెడుతున్నది. మొన్న జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను లిస్టు నుంచి తీసేశారు. దీనిలో దాదాపు 25 లక్షల మంది మహిళలే ఉన్నారు’’ అని పీకే శ్రీమతి ఆరోపించారు.
కార్పొరేట్ల కోసమే మణిపూర్ మంటలు: మరియం
మణిపూర్‌లో సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలె ఆరోపించారు. మహిళలపై లైంగిక దాడులు జరిగినా ఒక్కరిని కూడా శిక్షించలేదని.. సీఎంను మార్చారు తప్ప.. శాంతి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. యూపీలో బాధితులను, ఉద్యమకారులను బీజేపీ లీడర్లు బెదిరిస్తున్నారని తెలిపారు.
ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన కేరళ మంత్రి బిందు కళ అనేది కూడా ఒక సాంస్కృతిక విప్లవమేనని కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు రాధాకృష్ణణ్ అన్నారు. ఐద్వా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ’ని సోమవారం ఆమె ప్రారంభించారు. ‘స్ట్రెంత్ ఇన్ సాఫ్ట్‌నెస్’ పేరుతో ఏర్పాటు చేసిన చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.
