హైకోర్టుకు చేరిన తైబజార్ వేలం వ్యవహారం

హైకోర్టుకు చేరిన తైబజార్ వేలం వ్యవహారం

అయిజ, వెలుగు: అయిజ మున్సిపాలిటీ తైబజార్ వేలంపాట వ్యవహారం హైకోర్టుకు చేరింది. కమిషనర్ సైదులుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తైబజార్​వేలాన్ని నాలుగేళ్ల తర్వాత గత నెల 30న నిర్వహించారు. ఇందులో అయిజ పట్టణానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. రవీందర్ రూ.21.48 లక్షలకు దక్కించుకున్నాడు. రెండు రోజులు వసూళ్ల తర్వాత స్థానిక కాంగ్రెస్ నాయకులు, చిరు వ్యాపారులు తైబజార్ వసూలును వ్యతిరేకించి, నిలిపివేయాలంటూ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు.

ఈ నెల 1న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీడియా సమావేశంలో తైబజార్ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేరోజు కమిషనర్ సైదులు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిబంధనల ప్రకారం దక్కించుకున్న తనకు సమాచారం ఇవ్వకుండా తైబజార్ వేలాన్ని ఎలా రద్దు చేస్తారని కాంట్రాక్టర్​రవీందర్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే, సీడీఎంఏ కార్యాలయం, మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. హైకోర్టు సోమవారం కమిషనర్ కు నోటీసులు పంపిందని పేర్కొన్నాడు. ఈ విషయమై కమిషనర్​ను వివరణ కోరగా తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు.