పంటల దిగమతులపై 50 శాతం సుంకాలు విధించాలి : కోటేశ్వరరావు

పంటల దిగమతులపై  50 శాతం సుంకాలు విధించాలి : కోటేశ్వరరావు
  • ఏఐకేఎంఎస్​ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పత్తి, వరితోపాటు ఇతర వ్యవసాయ పంటల దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్​రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం ఏఐకేఎంఎస్​ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

 కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు విధించడం దారుణమన్నారు. విదేశీ మార్కెట్​కు తలొగ్గి మోదీ ప్రభుత్వం దేశ రైతుల హక్కులను తాకట్టు పెడుతుందని మండిపడ్డారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్​, న్యూడెమోక్రసీ నేతలు గౌని నాగేశ్వర రావు, ముక్తి సత్యం, ఏనుగు చంద్ర, ఉమర్, ప్రసాద్, రాంబాబు, మోకాళ్ల రమేశ్ పాల్గొన్నారు.