
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 76 మంది విమాన ప్రయాణికులు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఫ్యూయల్ లీక్ అవడంతో మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం ఎయిర్ పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు విమానాశ్రయ అధికారులు.
మంగళవారం మధ్యాహ్నం జైపూర్ నుంచి 76 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరిన ఎయిర్ ఏషియా ఫ్లైట్ (151543)లో ఉన్నట్టుండి సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలోని రెండు ఇంజన్లలో ఒక దాని నుంచి ఆయిల్ లీక్ అవడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే ఆ ఇంజన్ ను ఆఫ్ చేసి.. శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారమిచ్చాడు. సింగిల్ ఇంజన్ తో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు క్లియరెన్స్ తీసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు పూర్తిగా సన్నద్ధమైంది ఎయిర్ పోర్టు యంత్రాంగం. వెంటనే అన్ని ఫ్లైట్ ఆపరేషన్స్ నిలిపేసింది. అత్యంత అరుదుగా ప్రకటించే ఫుల్ ఎమర్జెన్సీని ఎయిర్ పోర్టులో డిక్లేర్ చేసి.. అత్యవసర సేవలకు సంబంధించిన అన్ని వ్యవస్థలను రెడీ చేసింది. ఎయిర్ ఏషియా ఫ్లైట్ పైలట్ ఎంతో నైపుణ్యంతో ఒక్క ఇంజన్ పైనే మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకునే వరకు ఇతర ఫ్లైట్ ఆపరేషన్స్ అన్నీ నిలిపేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు.
ఈ ఘటనపై ఎయిర్ ఏషియా ప్రకటన విడుదల చేసింది. జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడని తెలిపింది. విపత్తు సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై తమ సిబ్బందికి పూర్తి నైపుణ్యం ఉందని చెప్పింది. తమ సంస్థ తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేఫ్టీనే అని పేర్కొంది. ఈ ఘటనపై డీజీసీఏ అధికారులకు సమాచారం ఇచ్చామని, ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోందని ఎయిర్ ఏషియా ప్రతినిధి వెల్లడించారు.