
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కావడంపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం (జూలై 4) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2017లో మైనర్ వాటాదారుడిగా ఉన్న ఒక ప్రాపర్టీ కొన్నా. ఆ ప్రాపర్టీపై ఏదో లిటిగేషన్ ఉంది. నేను ప్రాపర్టీ కొన్న మైనర్ వాటాదారుడు బ్యాంక్ రుణం తీసుకుని తిరిగి కట్టలేదు.
అతడిపై ఈడీ విచారణ జరుగుతోంది. అతడి అకౌంట్స్ బుక్స్‌లో నా పేరు ఉండటం వల్ల ఈడీ నన్ను కూడా విచారణకు పిలిచింది. బాధ్యత గల పౌరుడిగా ఈడీ విచారణకు హాజరై వివరణ ఇచ్చా. మా ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీల గురించి ఈడీ అధికారులకు చెప్పా. అంతకుమించి అందులో ఏం లేదు’’ అని చెప్పారు అల్లు అరవింద్.
ALSO READ | అల్లు అరవింద్ ను ప్రశ్నించిన ఈడీ.. బ్యాంకు స్కాం కేసులో విచారణ
కాగా, యూనియన్ బ్యాంకు నుంచి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ 2018-19 మధ్య సుమారు రూ. 101 కోట్ల రుణాలను తీసుకుంది. తీసుకున్న ఈ 101 కోట్ల రూపాయల అప్పును రామకృష్ణ ఎలక్ట్రికల్స్ తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఇది పెద్దమొత్తంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రామకృష్ట ఎలక్ట్రానిక్స్ సంస్థకు అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీల గురించి తెలుసుకునేందుకే అల్లు అరవింద్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.