ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం.. తొలి విదేశీ నేతగా రికార్డ్

ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం.. తొలి విదేశీ నేతగా రికార్డ్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం- ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ట్రినిడాడ్ టొబాగో ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేస్సార్ ఈ అవార్డును ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వం, కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు తెలిపారు. 

తద్వారా ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం- ‘‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’ అవార్డ్ దక్కించుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని మోడీ రికార్డ్ సృష్టించారు. ప్రధాని మోడీ ప్రస్తుతం కరేబియన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. మోడీ పర్యటనను ఉమ్మడి వారసత్వం, ఇరు దేశాల చారిత్రక సంబంధాలకు చిహ్నాంగా అభివర్ణించారు.

ALSO READ | ట్రంప్ డెడ్లైన్ కాదు.. దేశ ప్రయోజనాల ఆధారంగా ట్రేడ్ డీల్: స్పష్టం చేసిన ఇండియా

ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో పురస్కారం దక్కడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. భారత్, ట్రినిడాడ్ & టొబాగో మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవార్డును ఇరు దేశాల ఉమ్మడి విలువలు, చరిత్ర, సాంస్కృతిక సంబంధాల ప్రతిబింబంగా మోడీ అభివర్ణించారు. ఈ అవార్డ్ కంటే ముందు ఘనా కూడా ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించిన విషయం తెలిసిందే.