18 ఏళ్ల నిరీక్షణకు తెర: ఆఖరికి AI సాయంతో గర్భం దాల్చిన మహిళ !

18 ఏళ్ల నిరీక్షణకు తెర: ఆఖరికి AI సాయంతో గర్భం దాల్చిన మహిళ !

ప్రతిమనిషి జీవితంలో పెళ్లి, పిల్లలు అనేది సహజం. కానీ పెళ్లి తరువాత పిల్లలు పుట్టకపోవడం అనేది వారిని  కలచివేస్తుంది. ఇప్పటికి కొందరు సంతానం కలగక విశ్వా ప్రయత్నాలు చేస్తుంటారు, ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటుంటారు. కానీ ఇలాంటి పరిస్థితే ఓ జంటకు ఎదురై  ఎన్నో ఏళ్ల కృషి తరువాత చివరకి తల్లితండ్రులు కూడా కాబోతున్నారు. అసలు సంగతి ఏంటంటే... 

గత 18 సంవత్సరాలుగా బిడ్డను కనాలని ప్రయత్నిస్తున్న ఒక జంట కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో చివరకు గర్భం దాల్చగలిగారు. ఈ జంట ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే  ఎన్నో సార్లు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా IVF చేయించుకున్నారు, కానీ ఫలితం లేకుండా పోయింది. అజోస్పెర్మియా అనే అరుదైన పరిస్థిస్తూల కారణంగా IVF ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి, ఇలాంటి పరిస్థితిలో పురుష భాగస్వామి వీర్యంలో కొలవగల స్పెర్మ్ ఉండదు. ఒక సాధారణ ఆరోగ్యకరమైన వీర్య నమూనాలో ప్రతి మిల్లీలీటర్‌కు మిలియన్ల కొద్దీ స్పెర్మ్ కణాలు ఉంటాయి.

ALSO READ | AI నుండి ఈ ఉద్యోగాలు సేఫ్.. కానీ జాగ్రత్తగా ఉండాలి: జెఫ్రీ హింటన్

అయితే ప్రతిచోట చేసిన ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఈ జంట కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (CUFC) వెళ్లగా, అక్కడ ఒక కొత్త విధానాన్ని ప్రయత్నించారు. పురుషులలో దాగి ఉన్న స్పెర్మ్‌ను గుర్తించడానికి AIని ఉపయోగించే STAR (స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ) పద్ధతిని ఉపయోగించి ఈ జంట అదృష్టవంతులయ్యారు. 

సంతానోత్పత్తి కేంద్రంలోని పరిశోధకులు AI-ఆధారిత వ్యవస్థతో వీర్య నమూనాను పరిశీలించి, దాగిన వీర్యాన్ని కనుగొనగలిగారు. వీర్యాన్ని పొందిన తర్వాత దానిని IVF ద్వారా భార్య అండాన్ని ఫెర్టిలైజ్ చేయడానికి ఉపయోగించారు. దింతో ఆమె STAR పద్ధతిని ఉపయోగించి గర్భం దాల్చిన మొదటి మహిళగా నిలిచింది.

"నేను నిజంగా గర్భవతినయ్యానని  నమ్మడానికి నాకు రెండు రోజులు పట్టింది. నేను ఇప్పటికీ ఉదయం నిద్రలేచి ఇది నిజమో కాదో అని నమ్మలేకపోతున్నాను. కానీ స్కాన్ చేసి చూసాక నేను గర్భవతినని అప్పుడు నమ్మను." అని ఆ మహిళ చెప్పుకొచ్చింది. CUFC డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ ఇంకా అతని టీం ఐదు సంవత్సరాల పరిశోధన తర్వాత STAR పద్ధతిని అభివృద్ధి చేశారు. నిజ జీవితంలో ఈ పద్ధతి ఫలితాలను ఇవ్వడంతో ఆ బృందం కూడా ఆశ్చర్యపోయింది.

"ఒకతను ఒక సాంపుల్ అందించాడు, అత్యంత నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు ఆ సాంపుల్ ద్వారా రెండు రోజులు వెతికి స్పెర్మ్‌ను గుర్తించడానికి ప్రయత్నించారు. కానీ గుర్తించలేకపోయారు. మేము దానిని AI- ఆధారిత STAR సిస్టమ్‌కు తీసుకువచ్చాము. ఒక గంటలో అది 44 స్పెర్మ్‌లను గుర్తించింది. అప్పుడే ఇది నిజంగా గేమ్-ఛేంజర్. సంతానం లేని వారిలో చాలా పెద్ద తేడాను తీసుకురాబోతోంది అని మేము గ్రహించాము" అని రీసర్చ్ టీం  హెడ్ విలియమ్స్ అన్నారు.

వీర్య నమూనాను సూక్ష్మదర్శిని క్రింద ప్రత్యేకంగా రూపొందించిన చిప్‌పై ఉంచిన తర్వాత, STAR వ్యవస్థ మొత్తం వీర్య నమూనాను స్కాన్ చేయడానికి ఇంకా ఒక గంటలోపు ఎనిమిది మిలియన్లకు పైగా ఫోటోలను  తీయడానికి  అధిక శక్తితో కూడిన ఇమేజింగ్‌ను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతి నిజంగా సంతానం లేని వారికీ ఒక వరం అని చెప్పవచ్చు. అలాగే మన దేశంలోకి ఈ పద్ధతి వస్తే తల్లితండ్రులు కావాలని లేదా సంతానం కలగక ఎదురుచూస్తున్న వారికీ ఎంతో మేలు చేస్తుంది.