వరుస విజయాలతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా లో సోషల్ మీడియా వేదికగా పంచుకునున్న ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీతో మెప్పించిన ఈ బ్యూటీ.. 'స్త్రీ శక్తి' గురించి ఆసక్తికమైన అభిప్రాయలను అభిమానులతో పంచుకుంది. శక్తి, బంధాలు, ఆత్మవిశ్వాసం... ఇలా అన్ని అంశాలు మహిళల జీవితానికి ఎంత ముఖ్యమో చెప్పారు.
'నేనున్నాను' అనే భరోసా ..
స్త్రీశక్తిని మాటల్లో వర్ణించడం కష్టమని రష్మిక అన్నారు. అయితే, మనతో మనం నిజంగా ఏకమైనప్పుడు, ఆ శక్తి ద్వారా అన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతామని చెప్పారు.. "ఏదో తేడా ఉందని, ఏదైనా జరగబోయే ముందే మీ మనస్సు చెబుతుంది. కానీ, జీవితం సంక్లిష్టంగా మారడం వల్ల ఆ భావనను కొన్నిసార్లు పట్టించుకోకుండా వదిలేస్తాం అని రష్మిక తెలిపారు. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలబడటం, సమస్యలు వినడం, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడం అనేది ఒక మాయాజాలమని రష్మిక చెప్పారు. మహిళలు మరొక మహిళను దగ్గరగా చేర్చుకోవడం, గాయాలను మాన్పడం, కేవలం 'నేనున్నాను' అనే భరోసా ఇవ్వడం... ఈ శక్తి ఎంతో అద్భుతమైనది అని ఉద్వేగంగా పోస్ట్ రాసుకొచ్చారు.
బలహీనత కాదు.. బలం
స్త్రీశక్తి అంటే బలహీనత కాదు. అది ఎంతో శక్తివంతమైనది, మనోబలంతో కూడినది, రక్షణ కల్పించేది, ప్రేమతో నిండినది అని రష్మిక స్పష్టం చేశారు. ఈ శక్తిని అర్థం చేసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని, కానీ ఇప్పుడు దాని విలువ తెలిసింది కాబట్టి, దానిని అన్ని విధాలా కాపాడుకుంటానని ఆమె స్పష్టం చేశారు. " మహిళలంతా ఏకమైతే, వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. అది తిరుగులేని శక్తి అని రష్మిక చెప్పారు. పని రంగంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మహిళలు తమ శక్తిని గుర్తించి, పరస్పరం మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
మొత్తం మీద రష్మిక చేసిన పోస్ట్ కేవలం వ్యక్తిగత భావన మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మహిళలో దాగి ఉన్న అపారమైన శక్తిని, పరస్పర మద్దతుతో వచ్చే విజయాలను గుర్తు చేసే ఒక శక్తివంతమైన సందేశం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. . ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు మరింత మందికి చేరాలని కోరుకుంటున్నారు.
