ఏసీల ధరలు పెరిగే చాన్స్..యుద్ధంతో సప్లై సమస్యలు

ఏసీల ధరలు పెరిగే చాన్స్..యుద్ధంతో సప్లై సమస్యలు
  • మార్కెట్లోకి ఐకానియా​ ఏసీలు
  • బ్లూస్టార్ ​గ్రూప్ ​ప్రెసిడెంట్ ​మోహిత్​ సూద్​

హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏసీ పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటున్నదని బ్లూస్టార్​ తెలిపింది. ఈ ఏడాది ఏసీల ధరలు 7 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కంపెనీ బ్లూస్టార్​ గ్రూప్​ప్రెసిడెంట్​మోహిత్​ సూద్ (యుటిలిటీ ప్రొడక్ట్స్​)​ తెలిపారు. ‘‘ముడి పదార్థాల ధరల పెరుగుదల, విద్యుత్ సామర్థ్య నిబంధనల్లో మార్పులు దీనికి ప్రధాన కారణాలు. జీఎస్​టీ తగ్గింపు కొంత ఊరటనిచ్చినప్పటికీ ధరలు పెరుగుతాయి. 

యుద్ధం వల్ల ప్లాస్టిక్ విడిభాగాల ధరలు పెరగడం, ముడి పదార్థాల సప్లై తగ్గడం వంటి ఇబ్బందులు ఉన్నాయి.  గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏసీ అమ్మకాల వృద్ధి 5 శాతం మేర తగ్గే అవకాశం ఉండవచ్చు.  2026–2027 మధ్య  15 శాతం వృద్ధి ఉండవచ్చు. ప్రస్తుతం ఏసీల తయారీలో 65 శాతం దేశీయ విడిభాగాలను వాడుతున్నాం. రాబోయే నాలుగైదు ఏళ్లలో ఇది 100 శాతానికి చేరుతుంది. ఏపీలోని శ్రీసిటీ ప్లాంట్ ద్వారా దక్షిణ భారత మార్కెట్ అవసరాలను తీరుస్తున్నాం. 

ఇక్కడి నుంచే అమెరికా, మిడిల్​ఈస్ట్​ దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం”అని ఆయన వివరించారు. మంగళవారం విడుదల చేసిన ఐకానియా ఏసీలను బీఈఈ కొత్త రూల్స్​ప్రకారం తయారు చేశామని, ఇవి సాధారణ ఇన్వర్టర్ ఏసీల కంటే 45 శాతం తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయని అన్నారు.  ఎండ 56 డిగ్రీలు ఉన్నా, సమర్థంగా పనిచేస్తాయని మోహిత్​ తెలిపారు.