మనోళ్ల కోసం రంగంలోకి ఎయిర్ ఫోర్స్

మనోళ్ల కోసం రంగంలోకి ఎయిర్ ఫోర్స్
  • 4 విమానాల్లో 798 మంది
  • ఉక్రెయిన్ నుంచి మనోళ్లను తీసుకొచ్చిన ఎయిర్ ఫోర్స్ 
  • ఇప్పటికి 6,400 మంది తరలింపు
  • రెండ్రోజుల్లో 7,400 మంది రాక

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గురువారం 4 విమానాల్లో 798 మందిని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ కు తీసుకొచ్చింది. ఇందుకోసం బుధవారం సీ17 మిలటరీ ట్రాన్స్ పోర్ట్ విమానాలను పంపింది. ‘‘ఫస్ట్ ఫ్లైట్ రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 200 మందితో బుధవారం అర్ధరాత్రి 1:30 గంటలకు చేరుకుంది. రెండో ఫ్లైట్ హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 210 మందితో గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఆ తర్వాత మూడో ఫ్లైట్ పోలాండ్ నుంచి 208 మందితో, నాలుగో ఫ్లైట్ బుకారెస్ట్ నుంచి 180 మందితో వచ్చింది. చివరి ఫ్లైట్ లో ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారు” అని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. వీళ్లకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారని తెలిపింది. 

24 గంటల్లో 3 వేల మంది.. 
గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 15 విమానాల్లో 3 వేల మందిని తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 30 విమానాల్లో 6,400 మందిని తీసుకొచ్చినం. రానున్న 24 గంటల్లో మరో 18 విమానాలు రానున్నాయి” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. యుద్ధం జరుగుతున్న ఖార్కివ్, సుమీ సిటీల నుంచి మనోళ్లను తరలించేందుకు ఉక్రెయిన్, రష్యా అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. కాగా, రానున్న రెండ్రోజుల్లో స్పెషల్ ఫ్లైట్లలో 7,400 మందిని ఉక్రెయిన్ నుంచి తీసుకురానున్నట్లు ఏవియేషన్ మినిస్ట్రీ చెప్పింది. శుక్రవారం 3,500 మంది, శనివారం 3,900 మంది వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇండియన్ స్టూడెంట్లను తరలిస్తం: రష్యా 
ఉక్రెయిన్ లోని ఖార్కోవ్, సుమీ సిటీల్లో చిక్కుకున్న ఇండియన్, ఇతర దేశాల స్టూడెంట్లను రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతానికి తరలిస్తామని రష్యన్ నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ హెడ్ కల్నల్ జనరల్ మిఖాయిల్ చెప్పారు. ఇందుకోసం 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్టూడెంట్లను బెల్గోరోడ్ నుంచి విమానాల్లో సొంత దేశాలకు పంపిస్తామన్నారు.