ఎయిర్‌ ఇండియా.. అమ్మకానికి అంతా రెడీ

 ఎయిర్‌ ఇండియా..  అమ్మకానికి అంతా రెడీ
  • బిడ్స్‌‌కు ముగిసిన డెడ్‌‌లైన్‌‌
  • మరోసారి  పెంచబోమన్న కేంద్రం
  •  రేసులో టాటా, స్పైస్ జెట్  

న్యూఢిల్లీ: దాదాపు రూ. 43 వేల  కోట్ల  అప్పులతో మూలుగుతున్న ఎయిర్ ఇండియా అమ్మకం పనులు ఆఖరిదశకు చేరుకున్నాయి. ఈ ఎయిర్‌‌లైన్స్‌‌ కంపెనీ అమ్మకానికి ఫైనల్ బిడ్లను గవర్నమెంటు ఆహ్వానించగా, టాటా, స్పైస్ జెట్   పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. విడివిడిగా లేదా ఉమ్మడిగా బిడ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను అమ్మడానికి ప్రభుత్వం రెడీ అయింది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయమై మాట్లాడుతూ ఫైనల్ బిడ్స్‌‌కు బుధవారమే డెడ్‌‌లైన్‌‌ అని, ఇది మారదని స్పష్టం చేశారు. నిజానికి 2018 లోనే ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటా అమ్మకం కోసం ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఈసారి స్పైస్‌‌జెట్‌‌, టాటా కంపెనీలు బుధవారం రాత్రి లోపు ఫైనాన్షియల్ బిడ్స్‌‌ అందజేసే అవకాశాలు ఉన్నాయి. "టాటా గ్రూప్, దాని హోల్డింగ్ కంపెనీ, స్పైస్‌‌జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్  తన వ్యక్తిగత హోదాలో ఈ ఎయిర్‌‌లైన్ కంపెనీ కోసం బిడ్స్ వేసే అవకాశం ఉంది" అని ఇండస్ట్రీవర్గాలు తెలిపాయి.  ఎయిర్ ఇండియాకు దాదాపు రూ. 43 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో రూ. 22 వేల కోట్లను ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఐఏహెచ్ఎల్) కి బదిలీ అవుతాయి. ఈ అప్పులన్నింటికీ ప్రభుత్వ హామీ ఉంది.  ఎయిర్‌‌లైన్ ను కొత్త యజమానులకు బదిలీ చేయకముందే ప్రభుత్వం ఈ అప్పును చెల్లిస్తుంది. 
అనుబంధ కంపెనీలనూ అమ్మేస్తారు
ఎయిర్ ఇండియాతోపాటు దీని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌లో 100 శాతం వాటాను అమ్ముతామని కేంద్రం గతంలో ప్రకటించింది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎయిర్‌‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 50 శాతం వాటాను అమ్మకానికి పెడతారు. ముంబైలోని ఎయిర్ ఇండియా భవనం, ఢిల్లీలోని ఎయిర్‌‌లైన్స్ హౌస్‌‌తో సహా ఇతర ప్రాపర్టీలు కూడా ఈ డీల్‌‌లో భాగమే! అంతేగాక ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద నాలుగు ఎకరాల భూమి, ఎయిర్ ఇండియా ఉద్యోగులు కోసం ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లోని వివిధ హౌసింగ్ సొసైటీలను కూడా అమ్మేస్తారు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఈఎస్ఎల్), ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్​పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐటీఎస్ఎల్) కూడా ఏఐఏహెచ్ఎల్ లో భాగమేనని ఆఫీసర్లు చెప్పారు. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా 4,400 డొమెస్టిక్, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌‌లతో పాటు విదేశాలలో 900 స్లాట్లను నిర్వహిస్తోంది.  అయితే విమానయాన రంగ ఎక్స్‌‌పర్ట్‌‌ ఒకరు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా టాటాల చేతికి వచ్చే అవకాశాలే ఎక్కువ అని అన్నారు.