26 ఏళ్ల ప్రజా ఉద్యమకారుడిని ఉరి తీయబోతున్న ఇరాన్ ఖమేనీ సర్కార్.. !

26 ఏళ్ల ప్రజా ఉద్యమకారుడిని ఉరి తీయబోతున్న ఇరాన్ ఖమేనీ సర్కార్.. !

ఇరాన్ దేశంలో గత కొన్ని వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ఒక యువకుడిని ప్రభుత్వం బుధవారం (జనవరి 14) ఉరితీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని పేరు ఎర్ఫాన్ సోల్తానీ, అతని వయస్సు  26 ఏళ్ళు. అతడిని జనవరి 8న పోలీసులు అరెస్టు చేయగా...  ప్రస్తుతం జైలులో ఉన్న సోల్తానీకి కనీస హక్కులు కూడా కల్పించడం లేదని తెలుస్తోంది.

 ఏం జరిగిందంటే: 
ఇరాన్‌లో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోవడంతో, గతేడాది డిసెంబర్ చివరి వారం నుండి ప్రజలు రోడ్ల పైకి  వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 186 నగరాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిరసనలను అణిచివేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ నిరసనల్లో భాగంగా ఇప్పటివరకు సుమారు 600 మందికి పైగా చనిపోయినట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అలాగే  దాదాపు 10 వేల మందిని పోలీసులు జైళ్లలో వేశారు.

 ఇరాన్ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రభుత్వం హద్దులు మీరుతోందని, నిరసనకారులపై హింసను తాము గమనిస్తున్నామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సూచించారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం అమలు చేయబోయే ఈ మొదటి ఉరిశిక్షతో అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.