వృద్ధుల కోసం ప్రణామ్.. తల్లిదండ్రులను చూడకపోతే జీతంలో 15 శాతం కట్

వృద్ధుల కోసం  ప్రణామ్.. తల్లిదండ్రులను చూడకపోతే జీతంలో 15 శాతం  కట్

 బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వృద్ధులైన పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, విచారణ జరిపి సదరు ఉద్యోగి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామన్నారు. ఆ మొత్తాన్ని నేరుగా పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసేలా రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తేబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘బాల భరోసా’ పథకాన్ని, వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు ‘ప్రణామ్’ను సీఎం రేవంత్ ప్రారంభించారు. 
 
వృద్ధుల కోసం ‘ప్రణామ్’.. ప్రభుత్వమే పెద్దకొడుకు

వయసు మళ్లిన తల్లిదండ్రుల కోసం దేశంలోనే తొలిసారిగా ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కొందరు పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని..  అలాంటి వారికి మానసిక ఉల్లాసాన్ని, రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించేందుకు, అన్ని వసతులతో ఈ కేంద్రాలు పని చేస్తాయన్నారు. వృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి, వారందరినీ ఒకచోట చేర్చి అండగా నిలుస్తుందని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 'ప్రణామ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

తల్లిదండ్రులను చూడకపోతే జీతంలో 15% కట్

గ్రూప్-1, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాక, పెండ్లి చేసుకుని అత్తగారిని చూస్తూ సొంత తల్లిదండ్రులను గాలికి వదిలేసే వారిపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా తల్లిదండ్రులు స్థానిక తహసీల్దార్​ లేదా ఎంపీడీవోకు తమ పిల్లలు చూడటం లేదని ఫిర్యాదు చేస్తే, దాన్ని పరిశీలించి సదరు ప్రభుత్వ ఉద్యోగి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.