సంక్రాంతి పండుగ హడావుడి అంతా భోగితోనే మొదలవుతుంది. ముచ్చటగా మూడు రోజులు చేసుకునే ఈ పండుగలో చిన్నా, పెద్ద అందరూ పాలుపంచుకుంటారు. బంధువులందరూ ఒకచోట చేరి సంతోషంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
మూడు రోజులు పండుగలో ఏరోజు సంబురం ఆ రోజుదే. ఈ ఏడాది జనవరి 14 బుధవారం రోజు భోగి పండుగ. ఈ పండుగ అంటేనే భోగభాగ్యాలను ఇష్టంతో పిలవడం కదా.. మరి భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ గురించి పురాణాల్లో ఏముందో.. ఆ పండుగను ఎందుకు జరుపుకోవాలి.. ఎలా జరుపుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
భోగి భాగ్యాలు
భోగి అంటే తొలినాడు', 'భోగము' అనే అర్థాలు ఉన్నాయి. మొదటిరోజు వచ్చేది కాబట్టి అలా పిలుస్తారు. భోగి 'భగ' అనేపదం నుంచి వచ్చిందని చెప్తారు. భగ అంటే మంట వేడిని పుట్టించేది. ఈ రోజుతో (2026 జనవరి 13) మధ్యాహ్నం 3.18 గంటలకు దక్షిణాయనం పూర్తి అవుతుంది. సూర్యుడు ఉత్తరాయనంలోకి అడుగు పెడతాడు. అలాంటి సూర్యుడికి, అతడికి ప్రతీక అయిన మంటతో ఆహ్వానం పలకడమే భోగి..
పురాణ కథలు
సంక్రాంతి పండుగ వెనక కొన్ని పురాణ కథలు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తి బలిచక్రవర్తిని మూడు వరాలు అడిగి, పాతాళానికి తొక్కేశాడని భాగవతం చెప్తుంది. అయితే, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి భోగా పండుగరోజు భూలోకానికి ప్రజలను ఆశీర్వదించే వరం ఇచ్చాడని అంటారు. అందుకే బలిచక్రవర్తిని భూలోకానికి ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేస్తారని చెప్తారు. వాన నుంచి ఆవులను, ప్రజలను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కూడా భోగి రోజేనని అంటారు.
ఇక శివుడు బసవన్నను రైతులకు వ్యవసాయంలో సహాయం చేయమని భూలోకానికి పంపించింది భోగి రోజేనట. అలాగే గోదాదేవి రంగనాథస్వామిని వివాహం చేసుకుని, ఆయనలో కలిసిపోయినది. భోగిరోజని చెప్తారు. అందుకే భోగి రోజు ప్రతి వైష్ణవాలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు.
భోగి రోజు లక్ష్మీదేవిని కొలుస్తారు. ధాన్యలక్ష్మికి కట్టు పొంగలి చేసి నైవేద్యంగా పెడతారు. రాగులు, జొన్నలు పండే ప్రాంతాల్లో వాటితో ప్రత్యేకంగా రొట్టెలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. భోగిరోజు పెళ్లికాని అమ్మాయిలు పాలతో పొంగలి చేసి లక్ష్మిదేవికి ప్రసాదంగా పెడితే వివాహం అవుతుందనీ నమ్ముతారు.
