నింగిలోకి ‘రుద్రమ వీ1’..రెండు సార్లు విఫలమై.. మూడోసారి సక్సెస్‌‌

నింగిలోకి ‘రుద్రమ వీ1’..రెండు సార్లు విఫలమై.. మూడోసారి సక్సెస్‌‌
  • నేషనల్ సైన్స్ డే సందర్భంగా వరంగల్ భద్రకాళి బండ్ నుంచి మోడల్ రాకెట్ లాంచింగ్

హనుమకొండ, వెలుగు : ఓరుగల్లు కేంద్రంగా నిర్వహించిన ‘రుద్రమ వీ1’ మోడల్‌‌ రాకెట్‌‌ ప్రయోగం మూడో ప్రయత్నంలో ఎట్టకేలకు సక్సెస్‌‌ అయింది. మొదటి, రెండు ప్రయత్నాల్లో లాంచింగ్‌‌ విఫలం కాగా.. రాకెట్‌‌ రూపకర్త శశాంక్ భూపతి నేతృత్వంలోని టీమ్ శ్రమతో మూడోసారికి విజయవంతం అయ్యింది. నేషనల్‌‌ సైన్స్‌‌ డే సందర్భంగా వరంగల్‌‌ నిట్‌‌, కుడా ఆధ్వర్యంలో ఇస్రో స్పేస్‌‌ ట్యూటర్, ఏటీడీఆర్ఎల్ ఫౌండర్ శశాంక్ భూపతి నేతృత్వంలో భద్రకాళి బండ్‌‌ వద్ద శనివారం రుద్రమ వీ1 మోడల్ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేశారు.

మోడల్ రాకెట్ రుద్రమ ప్రయోగాన్ని వీక్షించేందుకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్‌‌రెడ్డి, వరంగల్‌‌ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌‌ చాహత్‌‌ బాజ్‌‌పాయ్‌‌, ఇస్రో రిటైర్డ్‌‌ శాస్త్రవేత్త శేషగిరిరావు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ డైరెక్టర్ రఘునందన్‌‌ కుమార్‌‌తో పాటు వివిధ స్కూళ్లకు చెందిన స్టూడెంట్లు తరలివచ్చారు. మొదట కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన సెమినార్‌‌కు హాజరై.. అక్కడి నుంచి భద్రకాళి బండ్‌‌కు చేరుకున్నారు. రాకెట్ ప్రయోగం కౌంట్‌‌ డౌన్‌‌, ఆకాశం వైపు దూసుకెళ్లే దృశ్యాలను వీక్షించేందుకు భద్రకాళి బండ్‌‌పై డిజిటల్‌‌ స్క్రీన్‌‌లను ఏర్పాటు చేశారు. 

మూడో ప్రయత్నంలో గాలిలోకి..

రుద్రమ వీ1 మోడల్ రాకెట్‌‌ను సుమారు 350 గ్రాముల బరువుతో తయారు చేశారు. సుమారు 3 వేల అడుగుల వరకు ఎగురవేసేందుకు సిద్ధం చేసిన రాకెట్‌‌ను శనివారం సాయంత్రం 5.40 గంటలకు శశాంక్ భూపతి పర్యవేక్షణలో ప్రయోగించారు. రాకెట్‌‌ 50 అడుగులు కూడా ఎగరకుండానే కిందపడిపోయింది. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా మరోసారి రాకెట్ లాంచింగ్ నిర్వహించగా.. గాలిలోకి ఎగిరిన క్షణాల్లోనే నేలకూలింది. రెండు సార్లు ప్రయోగించినా రాకెట్ విఫలం కావడంతో జనాలు, స్టూడెంట్లు నిరాశతో వెనుదిరిగారు.

దీంతో అధికార యంత్రాంగంతో పాటు ఏటీడీఆర్ఎల్‌‌టీమ్‌‌ అంతా టెన్షన్‌‌కు గురైంది. ఆ తర్వాత మూడో ప్రయత్నంగా మరోసారి ప్రయోగం నిర్వహించగా.. ఆకాశం వైపు దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంతో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌‌బాయ్‌‌ హర్షం వ్యక్తం చేశారు.