
ఎయిర్ ఇండియా విమానం అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ల్యాండింగ్ సమయంలో పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో సింగపూర్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. భారీ ప్రమాదం నుంచి బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సింగపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం.. బుధవారం (మే 28) చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా తీవ్రమైన గాలుల కారణంగా ల్యాండింగ్ చేయకుండా ఎయిర్ పోర్ట్ చుట్టూ చక్కర్లు కొట్టించారు. దాదాపు ల్యాండ్ అయినట్లే రన్ వే పైకి వచ్చిన విమానం.. ఉన్నట్లుండి గాల్లోకి ఎగరటం ఎయిర్ పోర్ట్ అధికారులను, ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది.
వాస్తవానికి ఫ్లైట్ ఉదయం 10.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండ్ చేసేందుకు రన్ వే పైకి దాదాపు 200 ఫీట్ల పైకి తీసుకొచ్చారు. కానీ అదే సమయంలో తీవ్రమైన గాలి వీయడం, రన్ వే స్పష్టంగా కనిపించకపోవడంతో వెంటనే మళ్లీ ల్యాండ్ చేయకుండా పైకి లేపారు. దీంతో ఎయిర్ పోర్ట్ చుట్టూ మరో రౌండ్ తిప్పుకొచ్చి ల్యాండ్ చేశారు. దీంతో ల్యాండింగ్ కు 30 నిమిషాలు ఆలస్యం అయినట్లు అధికారులు తెలిపారు.
చెన్నై ఎయిర్ పోర్ట్ సెయింట్ థామస్ ఎండ్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. తీవ్రమైన గాలుల కారణంగా కంట్రోల్ తప్పిందని అధికారులు తెలిపారు. ఎదైనా ఫ్లైట్ ను సేఫ్ ల్యాండింగ్ చేయాలంటే సరైన స్పీడ్, ఫ్లైట్ ఉండాల్సిన కోణం, దిశ అన్ని సరైన రీతిలో ఉండాలని.. లేదంటే ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. బుధవారం వాతావరణ మార్పుల కారణంగా విమానం వేగంలో, దిశలో పూర్తిగా మార్పులు వచ్చాయని.. దీంతో సేఫ్ ల్యాండింగ్ చేయలేకపోయినట్లు తెలిపారు.
ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్ చేయలేక పోవడంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ అధికారులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గత అక్టోబర్ లో కూడా ఇండిగో ఫ్లైట్ ల్యాండ్ అయినట్లే అయ్యి టేకాఫ్ కావడం.. మార్చిలో మరో ఫ్లైట్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం.. తాజాగా బుధవారం కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ఎయిర్ పోర్ట్ అధికారులలో ఆందోళన కలిస్తున్న అంశం..