
జైపూర్: మరో ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి లేచిన 18 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. శుక్రవారం (జూలై 25) మధ్యాహ్నం జైపూర్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిరిండియా AI-612 విమానం ముంబై బయలుదేరింది. టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రత్తమైన పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడు.
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పర్మిషన్ కోరాడు. ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి జైపూర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం మధ్యాహ్నం 1.35 నిమిషాలకు టేకాఫ్ కాగా.. సాంకేతిక సమస్య తలెత్తడంతో 18 నిమిషాల తర్వాత తిరిగి 1.48కి ల్యాండ్ అయినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
సాంకేతిక లోపం తలెత్తడానికి గల కారణాలు ఏంటన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని ఎయిరిండియా తెలిపింది. కాగా, 2025, జూన్ 12 అహ్మదాబాద్ లో ఎయిరిండియా డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 270 మంది చనిపోయారు. ఈ ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానాల్లో వరుసగా తలెత్తున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఫ్లైట్ జర్నీ అంటేనే అమ్మో అని భయపడుతున్నారు ప్యాసింజర్లు.