V6 News

ఏటీఎఫ్ ధర తగ్గకుంటే.. విమానాలు బంద్

ఏటీఎఫ్ ధర తగ్గకుంటే.. విమానాలు బంద్
  • ఆదుకోకుంటే మరిన్ని కష్టాలు.. కేంద్రానికి స్పష్టం చేసిన కంపెనీలు

న్యూఢిల్లీ: ఇంధనం ధరలు పెరగడం వల్ల దేశీయ వైమానిక రంగం సంక్షోభం ఎదుర్కొంటోందని, సాయం చేయాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఏవీయేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను తగ్గించాలని కోరాయి.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షల వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు ఎక్కువ అయ్యాయి. విమాన నిర్వహణ ఖర్చుల్లో ఏటీఎఫ్ వాటా దాదాపు 40 శాతం ఉంటుంది. ఈ మూడు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ (ఎఫ్​ఐఏ) పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

ధరల అసాధారణ పెరుగుదల వల్ల విమానయాన సంస్థలకు భరించలేని నష్టాలు వస్తున్నాయని వివరించింది. దీనివల్ల విమానాలను నిలిపివేయడం, సర్వీసులు రద్దు చేయడం వంటి పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు ఒకే రకమైన ఇంధన ధరల విధానాన్ని అమలు చేయాలని ఎఫ్​ఐఏ కోరింది. ఏటీఎఫ్ పైన ఉన్న 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరింది.  గత నెలలో ప్రభుత్వం దేశీయ ఏటీఎఫ్ ధర పెంపును లీటరుకు రూ.15 పెంచింది. అంతర్జాతీయ సర్వీసుల ఇంధనం ధర లీటరుకు రూ.73 పెరిగింది.