
- చైనా పీఎల్ 15 క్షిపణిని నేలకూల్చాం
- స్వదేశీ తయారీ ఆకాశ్‌ను సమర్థంగా వినియోగించాం
- ఆ దేశంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్ ఆర్మీదే
- మన పోరాటం ఉగ్రవాదులతోనే కానీ.. పాకిస్తాన్‌తో కాదు
- ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేపట్టేందుకైనా సిద్ధమేనని వెల్లడి
- మన ఎయిర్ డిఫెన్స్ కవచంలా నిలిచింది: ఎల్జీ రాజీవ్‌ఘాయ్
- పాక్ దాడులను నేవీ తిప్పికొట్టింది: వైస్ అడ్మిరల్ ప్రమోద్
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామన్నారు. పాక్‌లో సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. సోమవారం ‘ఆపరేషన్ సిందూర్’పై రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ఘాయ్, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ఎస్ఎస్శార్ద పాల్గొన్నారు. పాక్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఏకే భారతి మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని వెల్లడించారు. పాకిస్తాన్లో జరిగిన నష్టానికి ఆ దేశ ఆర్మీదే బాధ్యత అని స్పష్టం చేశారు. పాక్మిసైల్స్, డ్రోన్లను తాము అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థతో తిప్పికొట్టామని చెప్పారు. చైనా మేడ్ పీఎల్ 15 మిసైల్‌ను నేలకూల్చామన్నారు. స్వదేశీ తయారీ ఆకాశ్‌ను సమర్థంగా వినియోగించామని వెల్లడించారు. మన కౌంటర్ సిస్టం టర్కీ డ్రోన్లనే కాదు.. దేనినైనా పడగొట్టగలదని తెలిపారు. దేశీయ పరిజ్ఞానం గొప్పగా ఉందని తెలిపారు. ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్చేపట్టాల్సి ఉన్నా తమ రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
ఇదొక వినూత్నమైన ఆపరేషన్
పాకిస్తాన్‌పై జరిపింది వినూత్నమైన ఆపరేషన్ అని ఎయిర్చీఫ్మార్షల్ ఏకే భారతి తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని, కరాచీ సమీపంలోని లక్ష్యాలపైనా దాడులు చేశామని చెప్పారు. అయితే, ఇందులో ఏయే ఆయుధాలు వినియోగించామో వెల్లడించలేమని అన్నారు. జైషే, లష్కర్ నేతల పేర్లతో కన్ఫ్యూజ్ చేసేందుకు పాక్ ప్రయత్నించిందని వెల్లడించారు. తమ పోరాటం ఉగ్రవాదులతోనే కానీ.. పాకిస్తాన్‌తో కాదని తేల్చిచెప్పారు. కాగా, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. పాకిస్థాన్‌లోని అణుస్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అక్కడ అణ్వాయుధాలు నిల్వ చేస్తున్నట్టు పాక్ తెలిపిందని, అందుకు థ్యాంక్స్ అంటూ చురకలంటించారు. అక్కడేమైనా ఉండనీ.. తాము టార్గెట్ చేసిన వాటిలో ఆ ఏరియా లేదని స్పష్టం చేశారు.
శత్రు దుర్భేద్యంగా డిఫెన్స్ సిస్టమ్: డీజీఎంవో ఎల్జీ రాజీవ్‌ఘాయ్
మన డిఫెన్స్ సిస్టమ్ శత్రు దుర్భేద్యంగా ఉన్నదని డీజీఎంవో ఎల్జీ రాజీవ్‌ఘాయ్ వెల్లడించారు. మన గగనతల రక్షణ వ్యవస్థలోని లేయర్స్‌ను చూస్తే మీకు ఇది బాగా అర్థమవుతుందని, శత్రువులు ఎన్ని హద్దులు దాటి వచ్చినా.. ఈ గ్రిడ్ సిస్టమ్‌లోని ఒక లేయర్ వారిని నాశనం చేసి తీరుతుందని చెప్పారు. మన ఎయిర్ డిఫెన్స్ అంత శక్తిమంతమైనది, విలువైనదని వెల్లడించారు. ఈ సందర్భంగా క్రికెటర్ విరాట్‌కోహ్లీ, యాషెస్క్రికెట్ టోర్నీ ప్రస్తావనను తీసుకొచ్చారు. మన ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ ద్వయంతో పోల్చారు. ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారని, ఆయన తనకు ఇష్టమైన క్రికెటర్ అని తెలిపారు.
అందువల్ల ఇప్పుడు క్రికెట్ ప్రస్తావన తెస్తున్నానని చెప్పారు. 1970ల్లో తాను స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరిగేదని, అందులో ఆసీస్ స్టార్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెనిస్ లిల్లీ విధ్వంసం సృష్టించారని గుర్తుచేశారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను వారిద్దరూ ఘోరంగా దెబ్బతీశారని చెప్పారు. అప్పుడు ఆస్ట్రేలియా ‘‘యాషెస్ టు యాషెస్ (బూడిదను ఉద్దేశిస్తూ).. డస్ట్ టు డస్ట్.. థామ్సన్‌కి దొరక్కపోతే.. లిల్లీకి చిక్కాల్సిందే’ అంటూ ఓ పదప్రయోగం చేసిందన్నారు. ఇప్పుడు అవే వ్యాఖ్యలను పాకిస్తాన్‌పై పోరులో భారత్ చూపిన పరాక్రమంతో సరిపోల్చవచ్చని అన్నారు.
రామచరిత మానస్‌లోని శ్లోకం చెప్పిన ఎయిర్ మార్షల్
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శిస్తూ రామధారీ సింగ్ దినకర్ రచించిన "యాచనా నహీ, అబ్ రణ్ హోగా" అనే కవితను ఉపయోగించారు. ఈ కవిత ద్వారా పాకిస్తాన్‌కు ఏ సందేశం ఇస్తున్నారని ఓ జర్నలిస్ట్ అడగ్గా ఎయిర్‌మార్షల్ ఏకే భారతి రామచరిత మానస్‌లోని శ్లోకాన్ని వినిపించారు. ‘‘వినయము లేని సముద్రం మూడు రోజులు గడిచినా కరగలేదు. అప్పుడు రాముడు కోపంతో సముద్రంపై బాణం వేయాలని నిర్ణయించాడు. .. భయం లేకుండా గౌరవం ఉండదు అని అన్నారు” అని లంకాదహనంలోని ఘట్టాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకడుగు వేయబోదని ఈ శ్లోకం ద్వారా సందేశం ఇస్తున్నట్టు చెప్పారు.
అడ్వాన్స్ రాడార్లతో డ్రోన్లను గుర్తించాం: వైస్ అడ్మిరల్ ప్రమోద్
నేవీ పటిష్ట నిఘాతో పాక్ దాడులను తిప్పికొట్టిందని వైస్‌అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. గగనతల దాడులను వెంటనే పసిగట్టి, వాటిని సమర్థవంతంగా నిలువరించామని పేర్కొన్నారు. నేవీ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను, మిగ్‌లు, హెలికాప్టర్ల ద్వారా దాడులను గుర్తించగలిగామని వివరించారు. ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు సైతం వినియోగించామని చెప్పారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్‌ను సమర్థంగా వినియోగించామని పేర్కొన్నారు. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయని చెప్పారు. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.