ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం

 ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీపావళి మరుసటి రోజు కాలుష్యం పెద్దగా పెరగకపోయినా.. గత రెండు రోజుల నుంచి పరిస్ధితి భిన్నంగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. గత నాలుగు రోజులుగా నగరంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300 పైనే ఉంటున్నది. తాజాగా ఆదివారం ఉదయం ఏఐక్యూ 350గా నమోదయింది. మరికొన్ని ప్రాంతాల్లో 400 దాటిపోయింది. అత్యధికంగా ఆనంద్‌ విహార్‌లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్‌పూర్‌లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్‌-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది.

అక్టోబర్ 29వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు వాయు నాణ్యత సూచిక (AQI) 390 వద్ద నమోదైంది, ఢిల్లీలోని ఆనంద్ విహార్‌తో సహా 16 చోట్ల AQI తీవ్ర స్థాయికి చేరుకుంది. తెల్లవారుజామున రోడ్లపై పొగ మంచు కమ్ముకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. అక్టోబర్ 29న నోయిడా లో 62 AQI 402 నమోదైంది.

ఘజియాబాద్‌లోని వసుంధరలో గాలి నాణ్యత 420కు చేరుకుంది. ఫరీదాబాద్‌లోని న్యూ ఇండస్ట్రియల్ టౌన్‌లో AQI 446గా నమోదైంది. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొల్యూషన్ కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఇండియా గేట్ వద్ద వాకింగ్ చేసేవారు, సైక్లిస్టులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాము గురుగ్రామ్ నుంచి వచ్చామని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

వాయు ప్రమాణాలు పడిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ఎన్‌సీఆర్‌లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులపై నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, దవాఖానలు, విమానాశ్రయాలు వంటి విభాగాలను ఆంక్షల నుంచి సడలించింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్‌ వాహనాలను ఉపయోగించాలని కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్‌ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.