- హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడి
- చైనాతోపాటు ఇండియాలోనే భారీగా మరణాలు
- లక్ష మందిలో 186 మంది గాలి కాలుష్యానికే బలి
- శ్వాస వ్యవస్థపైనే కాదు గుండె, మెదడుపైనా తీవ్ర ప్రభావం
- క్యాన్సర్, మతిమరుపు, 35% గుండె జబ్బులకూ ఇదే కారణం
న్యూఢిల్లీ: గాలి కాలుష్యం గత్తర లేపుతున్నది. రోజురోజుకు పెరిగిపోతున్న దీని ధాటికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్క 2023లోనే మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. శ్వాస వ్యవస్థపైనే కాకుండా నాడీ వ్యవస్థ, గుండె పైనా చెడుగాలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గుండె జబ్బులకు ఎయిర్ పొల్యూషన్ కూడా ఓ ప్రధాన కారకంగా మారుతున్నది. అంతర్జాతీయ సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌సిట్ట్యూట్ (హెచ్ఈఐ)’ తాజా నివేదికలో ఇది తేలింది. ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంపై స్టడీ చేసి ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ – -2025’ పేరిట రిపోర్టును విడుదల చేసింది. భారత్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని.. ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో జనం ఊపిరాడక ఆగమవుతున్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
52% మరణాలు ఆ రెండు దేశాల్లోనే
గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2023లో 79 లక్షల మంది చనిపోతే.. అందులో 52 శాతం మరణాలు చైనా, భారత్‌లోనే సంభవించాయని హెచ్ఈఐ తన నివేదికలో పేర్కొంది. 2023లో ఇండియాలో 20 లక్షల మంది, చైనాలో 20 లక్షల మంది గాలి కాలుష్యానికి బలయ్యారు.
లక్షలో 186 మంది..!
ఎయిర్ పొల్యూషన్‌తో అత్యధిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రీజియన్స్‌లో సౌత్ ఏసియా మొదటి స్థానంలో ఉంది. ఇందులో ఇండియాది ఫస్ట్ ప్లేస్. సౌత్ ఏసియాలో 2023లో ప్రతి లక్ష మందిలో 195 మంది కేవలం గాలి కాలుష్యం వల్లే చనిపోయారని.. ఇదే ఇండియాలో ప్రతి లక్ష మందిలో 186 మంది దీని ప్రభావంతో చనిపోయరని హెచ్ఈఐ తన రిపోర్టులో పేర్కొంది.
క్లీన్ ఎనర్జీతో 1.5 లక్షల మరణాలకు అడ్డుకట్ట
వంటింట్లో కట్టెలతో వంట చేయడంతో పొల్యూషన్ మరింత ఎక్కువగా ఉంటుందని, అయితే.. భారత్‌లోని రూరల్ ఏరియాల్లోనూ ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెరగడం ఓ మంచి పరిణామమని హెచ్ఈఐ అభిప్రాయపడింది. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద పల్లెల కూడా సబ్సిడీ కింద ఎల్పీజీ గ్యాస్ అందజేస్తుండటంతో దాన్ని వినియోగించేవాళ్లు పెరిగారని పేర్కొంది. గతంతో పోలిస్తే భారత్‌లోని రూరల్ ఏరియాల్లో ఉజ్వల్ వల్ల 3రెట్లు ఎల్పీజీ వాడకం పెరిగిందని తెలిపింది. గాలి కాలుష్యం (పీఎం 2.5 రేట్)ను 30 శాతం క్లీన్ ఎనర్జీ తగ్గిస్తుందని, ఎల్పీజీ వినియోగం ఇంకా పెరగాల్సి ఉందని నివేదిక పేర్కొంది. దీని వల్ల సంవత్సరానికి 1.5లక్షల మరణాలను అరికట్టవచ్చని హెచ్ఈఐ తన రిపోర్టులో ప్రస్తావించింది.
హైబీపీ తర్వాత పొల్యూషన్ మరణాలే ఎక్కువ
ప్రపంచంలో మరణాలకు అధిక రక్తపోటు మొదటి కారణమైతే.. రెండో కారణంగా ఎయిర్ పొల్యూషన్ అవతరించిందని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌సిట్ట్యూట్ (హెచ్ఈఐ) తన నివేదికలో పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 79 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా చనిపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.
10 ఎయిర్ పొల్యూషన్ మరణాల్లో 9 ఎన్సీడీ కేసులే!
భారత్ సహా సౌత్ ఏసియాలోని మిగతా దేశాల్లో చాలా మంది శ్వాస సమస్యలతో బాధపడుతున్నారని, ఇందుకు ఎయిర్ పొల్యూషనే కారణమని హెచ్ఈఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2013 నుంచి 2023 మధ్య భారత్‌లో గాలి కాలుష్యం పెరుగుతూ వచ్చిందని తెలిపింది. అనేక మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నారని.. గుండెపైనా ఎయిర్ పొల్యూషన్ తీవ్ర ప్రభావం చూపుతున్నదని.. గుండె జబ్బులకు గాలి కాలుష్యమే 35 శాతం కారణమవుతున్నదని పేర్కొంది. మెదడు, నాడీ వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయని.. మతిమరుపు రావడానికీ ఇదీ ఓ కారణమేనని గుర్తించింది. వాయు కాలుష్యం వల్ల జరిగే ప్రతి 10 మరణాల్లో దాదాపు 9 వరకు గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ , క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల (ఎన్సీడీ) వల్ల సంభవిస్తు న్నాయని నిర్ధారించింది. గాలి కాలుష్యం పెరుగుతూ పోతే గుండె జబ్బులు, మతిమరుపు రోగానికీ ఇదే ప్రధాన కారణం అయ్యే అవకాశం లేకపోలేదని ప్రస్తావించింది. చిన్నా పెద్ద అనే వయసుతో తేడా లేకుండా అందరిలోనూ ఎయిర్ పొల్యూషన్ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నదని, మతిమరుపు సమస్య కనిపిస్తున్నదని పేర్కొంది. భారత్‌లో గాలికాలుష్యాన్ని నివారించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్‌ను కఠినంగా అమలు చేయాలని ఈ నివేదిక సూచించింది.
