
ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఆదివారం ఏక్యూఐ 265గా నమోదైంది. దీపావళి సందర్భంగా సోమ, మంగళవారాల్లో గాలి నాణ్యత మరింత పడిపోయే చాన్సుంది.
న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 265గా నమోదైంది. అయితే గత ఏడేండ్లలో ఇదే తక్కువ కాలుష్యమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) తెలిపింది. ఢిల్లీలో సాధారణంగా దీపావళి టైమ్ లో గాలి నాణ్యత పడిపోతుంటుంది. పటాకులు పేల్చడంతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పొలాల్లో గడ్డి కాలబెట్టడంతో కాలుష్యం పెరుగుతుంటుంది.
దీపావళి సందర్భంగా సోమ, మంగళవారాల్లో గాలి నాణ్యత మరింత పడిపోతుందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ అంచనా వేసింది. పటాకులు కాల్చకున్నా ఏక్యూఐ 301 నుంచి 400, కాలిస్తే మరింత ఎక్కువగా 401 నుంచి 500 వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, పోయినేడు దీపావళికి ముందు రోజు ఏక్యూఐ 314గా, దీపావళి రోజు 382గా, ఆ తర్వాతి రోజు 462గా నమోదైంది.
గడ్డి కాల్చకుంటే లక్ష..
రైతులు పొలాల్లో గడ్డి కాలుస్తుండడంతో కాలుష్యం ఎక్కువవుతోంది. దీన్ని ఆపేందుకు పంజాబ్ స్పీకర్, ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వన్ రైతులకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన నియోజకవర్గం కొట్కాపురాలోని రైతులు గడ్డి కాల్చకుంటే పంచాయతీకి రూ.లక్ష చొప్పున ఇస్తానని ప్రకటించారు. గడ్డి కాల్చడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుండడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే దాన్ని మానేస్తున్నారని సంధ్వన్ చెప్పారు. త్వరలోనే పంజాబ్ రైతులందరూ గడ్డి కాల్చడం మానేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, గడ్డి కాల్చని రైతులను సంధ్వన్ పోయిన వారం సన్మానించారు.