గాలుల సాయం… ఢిల్లీలో కొంత మేర తగ్గిన పొల్యూషన్

గాలుల సాయం… ఢిల్లీలో కొంత మేర తగ్గిన పొల్యూషన్

    సైక్లోన్​ ప్రభావంతో వారంలో చిరుజల్లులు

    మెరుగుపడనున్న ఎయిర్​ క్వాలిటీ

    ప్రచారం కోసం కాదు.. పరిష్కారానికి ట్రై చేయండి

    కేజ్రీవాల్​కు జవదేకర్​ హితవు

 

ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎయిర్​ పొల్యూషన్ శనివారం కాస్త తగ్గుముఖం పట్టింది. గురు, శుక్ర వారాల్లో అత్యంత తక్కువ స్థాయికి పడిపోయిన ఎయిర్​ క్వాలిటీ శనివారం కొంత మెరుగుపడింది. సైక్లోన్​ ‘మహా’ ప్రభావంతో గాలి వేగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఢిల్లీలో ప్రస్తుతం గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వివరించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీలో ఎయిర్​ క్వాలిటీ 482 పాయింట్లు ఉండగా.. శనివారం కొంత మెరుగుపడి ఉదయం 10 గంటల ప్రాంతంలో  407 పాయింట్లకు చేరింది. ఘజియాబాద్, గ్రేటర్​ నోయిడాలలో కూడా ఎయిర్​ క్వాలిటీ కొంత మెరుగుపడిందని అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో ఈ నెల 7, 8 తేదీలలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్​లలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తేలికపాటి జల్లులే కురిసినా.. వర్షం వల్ల పొల్యూషన్​ తగ్గుతుందన్నారు. పంటపొలాల్లో వ్యర్థాల కాల్చివేత వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని చెప్పారు.

కేజ్రీవాల్​ బ్లేమ్​గేమ్: జవదేకర్

పొల్యూషన్​ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​బ్లేమ్​గేమ్​ ఆడుతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ ఆరోపించారు. పంజాబ్, హర్యానా సీఎంలకు లెటర్​ రాయాలంటూ స్కూలు పిల్లలకు చెప్పడం ద్వారా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు చేయడం మాని పొల్యూషన్ సమస్యకు పరిష్కార మార్గాలు వెతకాలని ఆయన హితవు పలికారు. ఢిల్లీ సర్కారు అడ్వర్టైజ్​మెంట్లపై 1500 కోట్లు ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బులు పంజాబ్, హర్యానాల్లోని రైతులకు అందించి, పంటల వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించాలని సూచిస్తే బాగుండేదని మంత్రి అన్నారు. పదిహేనేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు మోడీ సర్కారు పరిష్కారం వెదికేందుకు ప్రయత్నిస్తోందని, ఎన్​సీఆర్ మంత్రులు, అధికారులతో ఇంటర్​ స్టేట్​ మీటింగ్స్​ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని జవదేకర్ పిలుపునిచ్చారు.

అందర్నీ ఒక్కతాటిపైకి తేవాలి: అమరీందర్  సింగ్

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీరియస్​గా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందని పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ అన్నారు. పొల్యూషన్​ను కంట్రోల్​ చేసే విషయంలో పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని చెప్పారు. ఈ విషయంపై ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ ఎమోషనల్​ లెటర్​ రాశారు. ఢిల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని పంజాబీలు మరువబోరని అన్నారు. ఓవైపు దేశ రాజధానిని కాలుష్య మేఘాలు కమ్ముకుంటుంటే మరోవైపు దేశం అభివృద్ధి చెందుతోందని ఎలా చెప్పుకోగలమని ప్రశ్నించారు.  మనుషుల తప్పిదాలతో పరిస్థితి ఇంత దారుణంగా తయారుకావడం దురదృష్టకరమని అమరీందర్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పంజాబ్​ బాధ్యతను తాను మరవడంలేదన్నారు. పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టొద్దని రైతులను కట్టడి చేస్తున్నామని, దీనిని ఉల్లంఘించిన వారికి ఫైన్​ విధిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకున్నా ఈ విధానాన్ని అమలు చేయక తప్పడంలేదన్నారు. పంటల వ్యర్థాల నిర్వహణకు ప్రతీ క్వింటాలుకు రూ.వంద అదనంగా చెల్లించాలని ప్రధాని మోడీకి తాను పర్సనల్​గా సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అమరీందర్​ గుర్తుచేశారు.