బైకర్లకూ ఎయిర్‌‌ బ్యాగ్‌‌లు.. యాక్సిడెంట్ల నుంచి కాపాడేందుకు సేఫ్టీ కిట్‌‌ రూపకల్పన

బైకర్లకూ ఎయిర్‌‌ బ్యాగ్‌‌లు.. యాక్సిడెంట్ల నుంచి కాపాడేందుకు సేఫ్టీ కిట్‌‌ రూపకల్పన
  • కరీంనగర్‌‌ జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌‌ కాలేజీ స్టూడెంట్‌‌ శ్రీచందన ప్రజెంటేషన్‌‌
  • ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.12 లక్షలు మంజూరు చేసిన కేంద్రం 

కరీంనగర్, వెలుగు: బైక్‌‌ యాక్సిడెంట్‌‌లో తన తండ్రికి అయిన గాయాలు ఓ విద్యార్థినిని కొత్త ఆవిష్కరణ దిశగా నడిపించాయి. కారుకు యాక్సిడెంట్‌‌ అయితే ఎయిర్‌‌ బ్యాగ్‌‌లు తెరుచుకుని ప్రయాణికులు బయటపడినట్లే.. బైక్‌‌పై వెళ్లే వారికీ ఎయిర్‌‌బ్యాగులు తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఓ స్టూడెంట్‌‌ ఆలోచన... మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్‌‌ అండ్‌‌ మీడియం ఎంటర్‌‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) ఐడియా హ్యాకథాన్‌‌ 5.0లో ప్రశంసలు అందుకుంది. 

కరీంనగర్ తిమ్మాపూర్‌‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌‌ కాలేజీలో బీటెక్ ఈసీఈ ఫైనల్‌‌ ఇయర్‌‌ చదువుతున్న పెర్కరి శ్రీచందన ‘స్మార్ట్‌‌ వేరియబుల్‌‌ ఎయిర్‌‌బ్యాగ్ సిస్టం ఫర్‌‌ టూ వీలర్‌‌ రైడర్‌‌ సేఫ్టీ’ అనే అంశంపై రూపొందించిన ఎయిర్‌‌ బ్యాగ్‌‌ ప్రొటోటైప్‌‌ను ఎంఎస్‌‌ఎంఈ అప్రూవ్‌‌ చేసింది. 

బైకర్స్‌‌కు ఎయిర్‌‌ బ్యాగ్‌‌ను రూపొందించేందుకు రూ.12 లక్షల గ్రాంట్‌‌ను సైతం మంజూరు చేసింది. ఎంఎస్ఎంఈ నోటిఫికేషన్‌‌కు దేశవ్యాప్తంగా వేలాది మంది స్టూడెంట్లు, సైంటిస్ట్‌‌లు, అధ్యాపకులు అప్లై చేసుకున్నప్పటికీ.. ఇన్నోవేటివ్‌‌ ఐడియాస్‌‌తో  ఉన్న 502 మంది మాత్రమే ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో మాత్రమే సెలెక్ట్‌‌ కాగా ఇందులో శ్రీచందన ప్రాజెక్ట్‌‌ ఒకటి కావడం విశేషం. శ్రీచందనను జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేత జువ్వాడి సాగర్‌‌రావు అభినందించారు.

జాకెట్‌‌లో ఎయిర్ బ్యాగ్‌‌
బైక్‌‌ రైడర్‌‌ కోసం జాకెట్‌‌ లేదా ప్రత్యేకంగా రూపొందించిన కోటులో బెలూన్లు అమరుస్తారు. బైకర్‌‌ హెల్మెట్‌‌తో పాటు ఈ జాకెట్‌‌ ధరిస్తే యాక్సిడెంట్‌‌ సమయంలో కిందపడినప్పుడు వెంటనే బెలూన్స్‌‌ తెరుచుకుని బైకర్‌‌కు రక్షణగా నిలుస్తాయి. హెల్మెట్‌‌ ఎలాగైతే తలకు రక్షణగా ఉంటుందో అలాగే శరీరమంతటికీ కవర్‌‌ అయ్యేలా ఈ జాకెట్‌‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌‌ సక్సెస్‌‌ అయితే బైక్‌‌ రైడర్ల మరణాలు, క్షతగాత్రుల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. టూ వీలర్‌‌ సేఫ్టీ ఎయిర్ బ్యాక్‌‌లపై పేటెంట్‌‌ హక్కులు సైతం శ్రీచందనకు దక్కనున్నాయి.

మా నాన్నకు యాక్సిడెంట్‌‌ కావడం వల్లే...  
మా నాన్న ఒకసారి బైక్‌‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌‌ అవడంతో దెబ్బలు బాగా తగిలాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. మా నాన్నను చూసి చాలా బాధపడ్డా. టూ వీలర్లపై వెళ్లేవారు యాక్సిడెంట్‌‌కు గురైతే ఎలాంటి గాయాలు కాకుండా బయటపడడం ఎలా అని ఆలోచించా. హెల్మెట్‌‌ తల వరకు సేఫ్టీ ఇస్తుంది. మిగతా బాడీకి సేఫ్టీ ఎలా అనే ప్రశ్నే ఎయిర్‌‌ బ్యాగ్‌‌ రూపకల్పనకు కారణమైంది. నా ఆలోచనకు మా ప్రొఫెసర్లు చేసిన సహకారం మరువలేనిది.

శ్రీచందన, బీటెక్ ఫైనల్‌‌ ఇయర్‌‌, జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌‌ కాలేజీ