- గోటబయ, బసిల్లను విమానం ఎక్కనియ్యని జనం
- క్లియరెన్స్ ఇవ్వని ఇమిగ్రేషన్ ఆఫీసర్లు
- రాత్రంతా మిలటరీ బేస్ లోనే గోటబయ
కొలంబో: శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమైన రాజపక్స కుటుంబం దేశం విడిచి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు. గోటబయ సోదరుడు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స.. దుబాయ్ వెళ్లేందుకు కొలంబో ఎయిర్‌పోర్టుకు రాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. మూడు గంటల పాటు వీఐపీ లాంజ్‌లోనే వెయిట్ చేసిన బసిల్.. చివరికి ఇంటికి వెళ్లిపోయారు. 71 ఏండ్ల బసిల్, యూఎస్ పాస్‌పోర్ట్ హోల్డర్ అని, ఏప్రిల్‌లోనే తన పదవికి రాజీనామా చేశారని అన్నారు. సోమవారం అర్ధరాత్రి 12.15 గంటలకు వీఐపీ చెక్ఇన్ కౌంటర్ వద్ద ఉన్న బసిల్ రాజపక్సను గుర్తించిన శ్రీలంక వాసులు ఆయన్ను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ కేఏఎస్ కనుగల తెలిపారు. వీఐపీలు దేశం వీడకుండా చూడాలని తమపై ఒత్తిడి ఉందని, అందుకే బసిల్రాజపక్సకు క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. సిల్క్ రూట్ ప్యాసింజర్ క్లియరెన్స్ టెర్మినల్‌ను సోమవారం నుంచే మూసివేశామన్నారు.
సముద్ర మార్గాన పారిపోయే యత్నం
శ్రీలంక ప్రెసిడెంట్ గొటబయ రాజపక్స తన భార్యతో కలిసి యూఏఈ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన గోటబయ.. సోమవారమే రిజైన్ లేఖపై సంతకం చేసినట్టు తెలుస్తోంది. లేఖపై జులై 13 ఉందని, దాన్ని పార్లమెంట్ స్పీకర్‌కు ఇవ్వాల్సిందిగా.. సీనియర్ గవర్నమెంట్ అధికారికి 73 ఏండ్ల గోటబయ ఇచ్చినట్టు సమాచారం. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు గుర్తించి అడ్డుకుంటున్నారు. ఎలాగోలా.. బండార నాయకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా అధికారులు పాస్‌పోర్టుపై స్టాంప్ వేసేందుకు నిరాకరించారు. 4 యూఏఈ విమానాలు వదులుకున్న తరువాత.. రాత్రి మిలటరీ బేస్‌లో గోటబయ, ఆయన భార్య తలదాచుకున్నట్టు సమాచారం. అయితే గోటబయ, నేవీ పెట్రోలింగ్ క్రాఫ్ట్ ద్వారా పారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఏఎఫ్‌పీ అధికారిక వర్గాలు తెలిపాయి.
గోటబయ అక్కడ లేరు :
శ్రీలంక ఎయిర్ ఫోర్స్
గోటబయ, ఆయన భార్యకు తాను షెల్డర్ ఇవ్వలేదని చీఫ్ ఎయిర్ మార్షల్ సుదర్శన పథిరానా స్పష్టంచేశారు. శ్రీలంక ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఓ వీడియోను మాజీ పోలీస్ అధికారి అజిత్ ధర్మపాల రిలీజ్ చేశారు. గోటబయ ఫ్యామిలీ.. సుదర్శన పథిరానా ప్రైవేట్ హౌస్‌లో తలదాచుకున్న వార్తల్లో నిజం లేదన్నారు. చీఫ్ ఎయిర్ మార్షల్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.
