రూ. 8,330 కోట్లు సేకరించనున్న ఎయిర్​టెల్

రూ. 8,330 కోట్లు సేకరించనున్న ఎయిర్​టెల్

న్యూఢిల్లీ : టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌‌‌‌టెల్ 2015లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌‌‌‌ బకాయిలను ముందస్తుగా చెల్లించడానికి సుమారు బిలియన్ (సుమారు రూ. 8,330 కోట్లు) డాలర్లు సేకరించనున్నట్టు ప్రకటించింది.  ఈ నెలాఖరులో బార్‌‌‌‌క్లేస్,  సిటీ వంటి గ్లోబల్ బ్యాంక్‌‌‌‌లతో  నిధుల సేకరణ,  ధరల గురించి చర్చించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 2015లో స్పెక్ట్రమ్ కొనుగోలుకు సంబంధించి కంపెనీ రూ. 12 వేల కోట్లను కట్టాలి. తక్కువ ఖర్చుతో నిధుల సేకరణ గురించి కంపెనీ ఆరా తీస్తోంది. రీఫైనాన్సింగ్ వల్ల భారతి ఎయిర్‌‌‌‌టెల్​కు వార్షిక వడ్డీ ఖర్చులు ఆదా అవుతాయి.

బ్యాలెన్స్ షీట్‌‌‌‌ బలోపేతమవుతుంది. 5జీ కవరేజీని విస్తరించడానికి తగినన్ని నిధులు అందుబాటులో ఉంటాయని ఒక రిపోర్ట్​ తెలిపింది.  రెండేళ్ల క్రితం ప్రకటించిన రూ.21 వేల కోట్ల రైట్స్ ఇష్యూలో తొలి విడతగా రూ.5,247 కోట్లను ఈ టెల్కో సమీకరించింది. ఈ టెలికాం సంస్థ 111.6 మెగాహెజ్​ స్పెక్ట్రమ్‌‌‌‌ను రూ.29,130.2 కోట్లకు కొనుగోలు చేసింది. అందులో రూ.7,832.6 కోట్లు ముందస్తుగా చెల్లించి, తర్వాత మరో రెండు విడతల్లో రూ.8,815 కోట్లను, రూ.8,025 కోట్లను చెల్లించింది.