నాకది మైనస్ కాదు

నాకది మైనస్ కాదు

ఏడేళ్లలో పాతిక తమిళ చిత్రాల్లో నటించిన ఐశ్వర్యా రాజేష్..
ఇప్పుడిప్పుడే తెలుగులోనూ బిజీ అవుతోంది. విజయ్ దేవరకొండ
సరసన ఆమె నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫిబ్రవరి 14న
విడుదలవుతున్న సందర్భంగా ఐశ్వర్య చెప్పిన విశేషాలివి.

ఇప్పటివరకూ తమిళంలో నేను నటించినవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే. గ్లామర్ పాత్రలపై నాకు ఆసక్తి లేదు. నేను సూటవను కూడా. తెలుగు సినిమాల్లో గ్లామర్కి ప్రాధాన్యత ఎక్కువ కనుక ఇక్కడ ఎంట్రీ విషయంలో కొంత భయం ఉండేది. ఆ సమయంలోనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో చాన్స్ వచ్చింది. కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్ చిత్రాలు ముందుగా రిలీజ్ అయినప్పటికీ నేను తెలుగులో అంగీకరించిన తొలి చిత్రం ఇదే.
2018 డిసెంబర్లో క్రాంతి మాధవ్ ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. తెలుగు సినిమానే చేస్తున్నారా అని అడిగాను. ఎందుకంటే గత పదేళ్లలో ఇలాంటి పాత్రని తెలుగులో చూడలేదు. తమిళంలో ‘దర్మ దురై’ లాంటి చిత్రాల్లో ఇలాంటి పాత్ర పోషించాను కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది కచ్చితంగా కొత్తగా ఉండే క్యారెక్టర్. ‘ఫిదా’లో సాయిపల్లవి, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’లో నిత్యామీనన్ చేసిన పాత్రల్లా అరుదుగా వచ్చే చాలెంజింగ్ రోల్. ఎమోషనల్గా ఉండే స్ట్రాంగ్ క్యారెక్టర్. నా సీన్స్తోనే షూటింగ్ ప్రారంభించారు.

విజయ్తో నటించాను అనగానే లిప్ లాక్ సీన్స్ గురించి అడుగుతున్నారు. ఏ సినిమాలోనైనా లిప్ లాక్స్ ఉన్నాయంటే అది తప్పుడు సినిమా అని కాదు. నేను నటించిన తమిళ చిత్రం ‘వడచెన్నై’లోను నాలుగు లిప్ లాక్స్ ఉన్నాయి. కథ రీత్యా ఆ సీన్స్ అవసరం అనుకుంటే తప్పులేదు. కానీ అనవసరంగా జొప్పించకూడదు.

విజయ్ దేవరకొండ శీనయ్య అనే పాత్రలో ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తాడు. లొకేషన్లో ఎప్పుడూ అతన్ని విజయ్ దేవరకొండగా తనని చూడలేదు. శీనయ్యగా మాత్రమే చూశాను. అంతలా పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి నటించే పర్ఫెక్షనిస్ట్. చాలా సింపుల్గా ఉంటాడు. ఇక క్రాంతి మాధవ్ గారు వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. ప్రతి సీన్ సహజత్వానికి దగ్గరగా ఉండాలని తపన పడతారు.

కొత్తగా ఏదో చేయాలనే తపనతో ఇరవై ఒక్కేళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా ‘కాకాముట్టై’లో నటించాను. ఆ సినిమా తర్వాత నాకన్నీ నటనకి ప్రాధాన్యత గల పాత్రలే వచ్చాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత కూడా తెలుగులో నాకు మంచి పాత్రలు తెస్తుందనే నమ్మకముంది. నాని సరసన ‘టక్ జగదీష్’లో నటిస్తున్నాను. అదీ స్ట్రాంగ్ క్యారెక్టరే.

ఏడాదికి కనీసం రెండు తెలుగు సినిమాల్లోనైనా నటించాలనేది నా కోరిక. తమిళంలో మణిరత్నం గారు నిర్మించిన ‘వానమ్ కొట్టటుమ్’ ఈనెల 7న రిలీజ్ అవుతోంది. విజయ్ సేతుపతితో కలసి ‘కాపే రణసింగం’ అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలోనూ నటించాను. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేశాను.

తెలుగులో సౌందర్య గారి తర్వాత అనుష్క, సమంత అంటే ఇష్టం. ఓ బేబి, సూపర్ డీలక్స్ లాంటి సినిమాల్లోని పాత్రలు అందరు హీరోయిన్స్ పోషించలేరు. సమంత ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతున్నారు. ఇక హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఇష్టం. జయలలిత గారి బయోపిక్లో నటించాలనేది నా కోరిక. ఇప్పటికే చాలామంది నటిస్తున్నారు కనుక అవకాశమొస్తే సౌందర్య గారి బయోపిక్లో నటిస్తాను.

గ్లామర్, కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ నటించకపోవడం నా కెరీర్కి మైనస్ కాదు. ఇక్కడ కూడా బాగానే సంపాదిస్తున్నాను. మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. నేను నటించిన సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అంటే అవి కమర్షియల్ సినిమాలేగా!

నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు నాన్న చనిపోయారు. ఆయనకి ఐశ్వర్య అనే పేరంటే చాలా ఇష్టం. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తమిళ ఇండస్ట్రీలో చాలామంది ఐశ్వర్యలు ఉండడంతో పేరు మార్చుకుందామనుకున్నాను. కానీ నాన్నకి ఇష్టమని అమ్మ వారించడంతో ఆయన పేరును నా పేరుతో జత చేశాను. అది నాకు కలిసొచ్చింది కూడా. ‘కాకాముట్టై’ చిత్రానికి తొలిసారి ఐశ్వర్యా రాజేష్ అని టైటిల్ కార్డ్ పడింది. తర్వాత కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు.