
- ‘రోకో’ను ప్రతీ మ్యాచ్‌లో పరీక్షించడం అవివేకమే
- చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సెలెక్ట్ కాకపోవడంపై నెలకొన్న వివాదంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. షమీని జట్టులోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే పక్కన పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.‘షమీని జట్టులోకి తీసుకోవాలని మేము చాలా ప్రయత్నించాం. కానీ అతను ఈ టూర్ కోసం ఫిట్‌గా లేడు. ఒకవేళ షమీ ఫిట్‌గా ఉండి ఉంటే ఇంగ్లండ్ టూర్‌లోనే ఆడేవాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ సీజన్ ఇప్పుడే మొదలైందన్న అజిత్.. రాబోయే రెండు నెలల్లో అతను ఫిట్‌నెస్ సాధిస్తే తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు తలుపులు తెరిచే ఉంటాయని చెప్పాడు. ప్రస్తుతం బెంగాల్ టీమ్ తరఫున రంజీల్లో బరిలోకి దిగిన షమీ ఆసీస్‌తో వన్డేలకు సెలెక్ట్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. తాను ఫిట్‌గా ఉన్నానని.
ఒకవేళ ఫిట్‌నెస్ సమస్య ఉంటే రంజీ ట్రోఫీలో ఆడేవాడిని కాదన్నాడు. అలాగే, తన ఫిట్‌నెస్ గురించి సెలెక్టర్లు అప్‌డేట్ ఇచ్చే పని తనది కాదన్నాడు. షమీ వ్యాఖ్యలపై అగార్కర్ స్పందించాడు. ‘తను నాతో నేరుగా ఆ విషయం చెబితే, నేను సమాధానం ఇస్తాను. నేను అతను చెప్పింది చదివితే ఫోన్ చేసి మాట్లాడతాను. గత కొన్ని నెలలుగా నేను షమీతో చాలాసార్లు మాట్లాడాను’ అని చెప్పాడు. ఇక, రోహిత్, కోహ్లీ (రోకో) ఫ్యూచర్‌పై వస్తున్న వార్తలు, ఊహాగానాలపైనా అగార్కర్ స్పందించాడు. ప్రతి మ్యాచ్‌లో వాళ్లకు పరీక్ష పెట్టాలనుకోవడం అవివేకమని అన్నాడు. ఈ సిరీస్‌లో రన్స్ చేయకపోయినా రోకోను వెంటనే తప్పించబోమని, అలాగే సెంచరీలు చేసినంత మాత్రాన 2027 వరల్డ్ కప్‌కు ఎంపికైనట్లు కాదని స్పష్టం చేశాడు. ఈ ఇద్దరు లెజెండ్స్ ఆటను నిరంతరం అంచనా వేస్తామని చెప్పాడు. ఇక, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలన్నది కోహ్లీ, రోహిత్ సొంత నిర్ణయమని, సెలెక్షన్ కమిటీ దాన్ని గౌరవించిందని అగార్కర్ వెల్లడించాడు.