Virat Kohli: ఆస్ట్రేలియా సిరీస్‌కు డౌట్.. అగార్కర్ మాట లెక్క చేయని కోహ్లీ

Virat Kohli: ఆస్ట్రేలియా సిరీస్‌కు డౌట్.. అగార్కర్ మాట లెక్క చేయని కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడు బరిలోకి దిగుతాడో సస్పెన్స్ గా మారింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో కోహ్లీ ఆడడం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ ఆడతాడని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే విషయమే. వస్తున్న సమాచారం ప్రకారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల విరాట్‌ను సంప్రదించి తన వన్డే ప్రణాళికల గురించి చర్చించారని టాక్ నడుస్తోంది. అయితే కోహ్లీ నుంచి సరైన సమాచారం అందలేదని నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కోహ్లీ ఫ్యామిలీతో లండన్ లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కు నెల రోజుల సమయం కూడా లేదు. ఈ సమయంలో కోహ్లీ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. ఒకవేళ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమైతే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవాకాశాలు ఉన్నాయి. ఫిట్ నెస్ టెస్ట్ కోసం ఇండియాకు రాకపోవడంతో బీసీసీఐ కోహ్లీకి లండన్ లోనే ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించింది. ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేసిన కోహ్లీ ఇక ఆస్ట్రేలియా ఆడతాడని భావించినా ఇప్పుడు కోహ్లీ సరిగ్గా స్పందించకపోవడంతో వన్డే పునరాగమనంపై క్లారిటీ రావడం లేదు. 

అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కనిపించి ఆరు నెలలు దాటింది. చివరిసారిగా టీమిండియా తరపున ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. టెస్ట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న విరాట్.. ఆ తర్వాత లండన్ వెళ్ళాడు. ఇప్పటివరకు ఇండియా తిరిగి రాలేదు. తన ఫ్యామిలీతోనే లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ జూలైలో జరిగిన వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు.