Thala Ajith: తిరుమల శ్రీవారి సేవలో అజిత్.. దివ్యాంగుడితో సెల్ఫీ వీడియో వైరల్!

Thala Ajith: తిరుమల శ్రీవారి సేవలో అజిత్.. దివ్యాంగుడితో సెల్ఫీ వీడియో వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో 'తలా' అజిత్ కుమార్ తన సినిమాలతోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ అభిమానులను , ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. షూటింగ్ లకు విరామం ఇచ్చి ఇప్పుడు ఆథ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ( మంగళవారం 28న ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు అజిత్ కు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

అభిమానులకు స్వీట్ వార్నింగ్..

అయితే స్వామి వారి దర్శనం అనంతరం అజిత్ ను చూసిన అభిమానులు ఉత్సాహంతో "తలా! తలా!" అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో వారిని ఆలయం వద్ద నిశబ్దంగా ఉండాలని సైగ చేశారు. దేవాలయ ప్రాంగఘంలో గట్టిగా అరవడం సరికాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోవాలని అభిమానులకు సూచించారు. ఇప్పుడు ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

దివ్యాంగుడితో 'తలా' సెల్ఫీ.. 

అజిత్ తిరుమల పర్యటనలో మరో ఆసక్తికర సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ దివ్యాంగుడైన అభిమాని వద్దకు అజిత్ స్వయంగా వెళ్లి, అతని మొబైల్ ఫోన్ తీసుకుని తన పక్కన నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. తమ అభిమాన నటుడు వ్యక్తిగతంగా చూపించిన ఈ ఆదరణ చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఈ సెల్ఫీ వీడియో కూడా విపరీతంగా షేర్ అవుతోంది. అజిత్ చేసిన పనిని అభినందిస్తూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 

 సినిమాలతో పాటు రేసింగ్..

ఈ ఏడాది అజిత్ నటించిన 'విడాముయర్చి' ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) చిత్రం మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అజిత్ కెరీర్‌లో కమర్షియల్‌గా మైలురాయిగా నిలిచింది. ఈ విజయం తర్వాత, అజిత్ తదుపరి చిత్రం 'AK64' కూడా అధిక్ రవిచంద్రన్‌ దర్వకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కేరళలోని పాలక్కాడ్‌లో ఉన్న భగవతి అమ్మన్ ఆలయాన్ని కుటుంబంతో కలిసి సందర్శించారు.