కేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ

కేంద్రం తీరు వల్లే తెలంగాణలో రెవెన్యూ లోటు : అక్బరుద్దీన్ ఓవైసీ

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల నిధుల వాటా తగ్గిందని అన్నారు. కేంద్రం ఇష్టారీతిన అప్పులు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై మీద ఆంక్షలు విధించడం ఎందుకని ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్ పై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. కేంద్రం తీరు వల్లే రాష్ట్రంలో రెవెన్యూ లోటు తలెత్తుతోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇక్కడ విభజన రాజకీయాలు చేసే బదులు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పోరాడితే బాగుంటుందని సూచించారు. 

కేంద్రం మైనార్టీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించిన అక్బరుద్దీన్.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడంపై ఆలోచన చేయాలని సూచించారు. మైనార్టీ వర్గాలు, విద్యార్థులకు పెండింగ్ నిధులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‭లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం నిరాశ పరిచిందన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.