
హైదరాబాద్ : సెక్రటేరియట్ కూల్చివేత-కొత్త అసెంబ్లీ నిర్మాణంపై ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి నిర్వహణలో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని నాయకులు, వక్తలు మాట్లాడారు.
దేశంలో సచివాలయానికి రాని సీఎం ఒక్క KCR మాత్రమే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. 6 నెలల నుండి పెన్షన్స్ ఇవ్వడం లేదన్నారు. కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు తెరమీదకు తీసుకొస్తున్నారని అన్నారు రమణ.
2014 నుండి ప్రతిపక్షాలు కలిసి పోరాడి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ ఆలీ. అందరం కలిసి పోరాడితే కేసీఆర్ కు భయం ఉండేదన్నారు.
అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధ. సెక్రటేరియెట్ కూల్చివేత, అసెంబ్లీ నిర్మాణంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె…వారసత్వ సంపదను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా అందరం కలిసి పోరాడాలన్నారు. వాటివల్లే హైదరాబాద్ కు ఎంతో గొప్ప పేరు వచ్చిందని తెలిపారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా దృష్టిని మరల్చేందుకే రోజుకో అంశం తెరపైకి తెస్తున్నారన్నారు సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన విమర్శను స్వీకరించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారన్నారు. భవనాల కూల్చివేతలపై రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో 2 సార్లు మాత్రమే అఖిల పక్ష సమావేశం నిర్వహించారన్న పల్లా వెంకట్ రెడ్డి…..ప్రజల దృష్టిని మరల్చేందుకే రోజుకో అంశం తెరపైకి తెస్తున్నారు.
ఉన్నవాటిని నాశనం చేయమని ప్రజలు TRSకు అధికారం ఇవ్వలేదన్నారు సీనియర్ లాయర్ సత్యం రెడ్డి. ప్రతి నగరం ఒక విశిష్టతను కలిగి ఉంటుందన్నారు. నగర వారసత్వ సంపదను కాపాడాలని హుడా నిబంధనల్లో ఉండేదన్న సత్యంరెడ్డి భవనాల డీపీఆర్ సమర్పించాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు TJS అధికార ప్రతినిధి విశ్వేశ్వర్ రావు. ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు చెప్పిందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని తెలిపారు. యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టలేదన్న విశ్వేశ్వర్ రావు.. ఉద్యమాలు అణచేందుకు మాత్రమే పోలీస్ రిక్రూట్ మెంట్ చేస్తున్నారన్నారు.