
- రంగంలోకి దిగిన తహసీల్దార్, వృద్ధురాలి కొడుకులకు కౌన్సెలింగ్
- తల్లి బాగోగులు చూసుకుంటామని రాసిచ్చిన కొడుకులు
కుంటాల, వెలుగు: ‘నా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు.. నాకు న్యాయం చేయండి’ అంటూ ఓ వృద్ధురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఆఫీసర్లు సదరు వృద్దురాలి కొడుకులతో మాట్లాడి ఇక నుంచి బాగా చూసుకుంటామని హామీ పత్రం రాయించారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా కే గ్రామానికి చెందిన జమెల్ల లక్ష్మికి శంకర్, రమేశ్ కుమారులు, ఓ కూతురు ఉండగా.. ముగ్గురికీ వివాహాలు అయ్యాయి. కుమారులు తల్లిని పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటివేయడంతో కొన్ని రోజులుగా కూతురు వద్ద ఉంటోంది.
ఈ క్రమంలో లక్ష్మి బుధవారం భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డిని కలిసి తన కొడుకులు తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. ఆర్డీవో ఆదేశాలతో తహసీల్దార్ కమల్‌సింగ్ లింబా కే గ్రామానికి వెళ్లి గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపారు. అనంతరం మహిళ కొడుకులతో మాట్లాడారు. దీంతో ఇక నుంచి తల్లి బాగోగులు చూసుకుంటామని, ఆమెకు ఇల్లు నిర్మించడంతో పాటు రూ.3 లక్షలు అకౌంట్‌లో జమ చేసి, ప్రతి నెల ఖర్చుల కోసం రూ. 2 వేలు ఇస్తామని గ్రామ పెద్దల సమక్షంలో శంకర్, రమేశ్ ఒప్పుకొని లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. దీంతో ఆఫీసర్లు, గ్రామ పెద్దలకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపింది.