
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్నార్)101వ జయంతి సందర్భంగా అభిమానులకు ఓ అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన నటించిన రెండు అపురూప చిత్రాలు 'డాక్టర్ చక్రవర్తి' ,'ప్రేమాభిషేకం' తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించబడుతున్నాయి. సెప్టెంబర్ 20, 2025 నుంచి ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏఎన్నార్ అభిమానులందరికీ, ముఖ్యంగా ఆయన నటనను ఆరాధించే కుటుంబాలకు, సీనియర్ సిటిజన్లకు ఇది నిజంగా ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఈ ప్రదర్శనల కోసం టికెట్లను సెప్టెంబర్ 18, 2025 నుంచే బుక్‌మైషో (BookMyShow)లో బుక్ చేసుకోవచ్చు.
ఏఎన్నార్ సినిమాటిక్ మేజిక్ తిరిగి తెరపైకి
‘డాక్టర్ చక్రవర్తి’ (1964) చిత్రం గురించి చెప్పాలంటే, ఇది తెలుగు సినిమాకు ఒక సరికొత్త హుందాతనాన్ని తెచ్చిన సినిమా. ఈ సినిమాలోని ఏఎన్నార్ నటన, ఆయన డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఈ సినిమాకు గాను ఏఎన్నార్ ఉత్తమ నటుడిగా తన మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు (సౌత్) అందుకున్నారు. ఇది కమర్షియల్‌గా మాత్రమే కాకుండా, కళాత్మకంగా కూడా అత్యుత్తమమైన చిత్రంగా నిలిచింది.
ALSO READ : క్రైమ్ పాయింట్‌తో ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా..
ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వాటిల్లో ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. అప్పటికి ఇప్పటికీ ఈ పాటలు ఎవర్ గ్రీన్ గా హిట్ సాంగ్స్ గానిలిచాయి.
ఇక, 'ప్రేమాభిషేకం' (1981) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక సాంఘిక చిత్రం. ఇది అప్పటి యువతను, కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఏఎన్నార్ పలికిన ప్రతి సంభాషణా, చూపించిన ప్రతి భావోద్వేగమూ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం ఏఎన్నార్ నటనతో పాటు, చక్రవర్తి అందించిన పాటలు. ఈ సినిమాలోని పాటలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా ఏకంగా 500 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది.
ఏఏ థియేటర్లలో ప్రదర్శనలు?
ఈ అద్భుతమైన అవకాశం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. విశాఖపట్నంలోని క్రాంతి థియేటర్, విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్, ఒంగోలులోని కృష్ణ టాకీస్లలో ఈ సినిమాలు ప్రదర్శితం అవుతాయి. హైదరాబాద్‌లో థియేటర్ల పేర్లతో పాటు మరిన్ని కేంద్రాలను కూడా త్వరలో జాబితాలో చేర్చవచ్చని నిర్వాహకులు తెలిపారు.
అక్కినేని నాగేశ్వర రావు వంటి దిగ్గజ నటుడికి నివాళిగా, ఆయన జయంతి వేడుకలను ఉచితంగా సినిమా ప్రదర్శనలతో జరుపుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప గౌరవం. సినిమా అంటే ఒక కల, ఒక ప్రపంచం అని నమ్మిన ఏఎన్నార్ నటించిన ఈ అద్భుత చిత్రాలను మళ్ళీ పెద్ద తెరపై పాత తరం నుంచి కొత్త తరం వరకు అందరికీ మరిచిపోలేని సినీ అనుభూతిని అందజేసే ప్రయత్నం చేయనున్నారు.