
చంద్రహాస్ హీరోగా జైరామ్ చిటికెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాయిన్’. శ్రీకాంత్ రాజారత్నం నిర్మిస్తున్నారు. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ‘నటుడు ప్రభాకర్ గారితో ఉన్న అనుబంధంతో ఆయన కొడుకు చంద్రహాస్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ కథ విన్నప్పుడు ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు.
చంద్రహాస్ మాట్లాడుతూ ‘పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, మెల్ట్ చేయడం నేపథ్యంలో సాగే క్రైమ్ పాయింట్‌తో, యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను’ అని అన్నాడు.
ఈ చిత్రం కథను తన కంటే చంద్రహాస్ ఎక్కువ నమ్మాడని చెప్పిన దర్శకుడు జైరామ్.. సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేస్తామని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్, లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.