
న్యూఢిల్లీ: ఇండియాపై అమెరికా విధించిన ప్రతీకార వాణిజ్య సుంకాలపై కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఎగుమతులపై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా త్వరలో ఉపసంహరించుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌పై పరస్పర సుంకాన్ని 25 శాతం నుంచి 10-15 శాతానికి తగ్గించవచ్చని అన్నారు. గురువారం (సెప్టెంబర్ 18) భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్ ఇండియా, అమెరికా పరస్పర సుంకాలు, వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు.
ఇండియా, అమెరికా మధ్య నెలకొన్న సుంకాల వివాదాన్ని ఇరుదేశాలు త్వరలో పరిష్కరించుకోవచ్చన్నారు. ట్రేడ్ డీల్‌పై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. రాబోయే ఎనిమిది, పది వారాల్లో చర్చల్లో పురోగతి కనపించవచ్చని తెలిపారు. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలిస్తే భారత ఎగుమతిదారులకు ఉపశమనం కలగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ : ఇక ఇన్సూరెన్స్ ఏజెంట్ల మోసాలకు చెక్..
ప్రతీకార సుంకాల్లో భాగంగా భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న సాకుతో భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించాడు ట్రంప్. దీంతో ఇండియాపై సుంకాలు మొత్తం 50 శాతానికి చేరుకున్నాయి. ట్రంప్ ఏకపక్షంగా ఇండియాపై ఎడాపెడా సుంకాలు విధించడంతో ఇరుదేశాలు మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది.
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్ పడింది. తిరిగి ఇటీవల ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఈ మేరకు అమెరికా బృందం ఇండియా వచ్చి భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. దీంతో త్వరలోనే ఇండియా, అమెరికా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ ముగిసి.. ట్రేడ్ డీల్ కుదరనున్ననట్లు తెలుస్తోంది.