
- 18 వేల గ్రూపుల ఏర్పాటుపై సర్కార్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లోని దివ్యాంగ మహిళలతో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటుపై ఫోకస్ పెట్టామని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. ప్రతి గ్రూప్‌లో 5 నుంచి 20 మంది వరకు దివ్యాంగ మహిళలు ఉండేలా సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సీఈవో దివ్య దేవరాజన్, డైరెక్టర్లు సాయి కిషోర్, కృష్ణమూర్తితో ముత్తినేని వీరయ్య సమావేశమయ్యారు. సంఘాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంఘాలు సహాయపడతాయని వివరించారు. సుమారు18 వేల దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఇందులో భాగంగానే దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 2,367 సంఘాలకు ఇటీవల రూ.3 కోట్ల 55 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారని చెప్పారు. మిగతా ఆర్థిక వనరులను సంఘ సభ్యులు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో పొందవచ్చన్నారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.. దివ్యాంగుల స్వయం సహాయక గ్రూప్‌ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించామన్నారు. ఈ సంఘాల ద్వారా దివ్యాంగ మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.