
- రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ఇటీవల దొరికిన జిలెటిన్ స్టిక్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన ఆఫీస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. టౌన్లో ఇటీవల జిలెటిన్ స్టిక్స్ దొరికితే తన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారన్నారు. పోలీసు అధికారులు చెబుతున్న వెంచర్లో తన పేరిట భూమి రిజిస్ర్టేషన్ లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక కొందరు కేసులో ఇరికించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరానని రేవంత్‌రెడ్డి ఇక్కడ పోటీ చేయగా ప్రచారం చేశానన్నారు.
తన సేవలను గుర్తించి పీసీసీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పారన్నారు. అశోక్‌నగర్ చౌరస్తాలో అరెస్ట్‌చేసినట్లు పోలీసులు చూపారని, వెంచర్ కాగితాలు ఇచ్చేందుకు స్టేషన్‌కు వెళ్లానన్నారు. అక్కడ ఏఎస్పీ ఉన్నారని, కొద్ది సేపటి తర్వాత ఎస్పీ దగ్గరకు వెళ్దామని చెప్పి బాన్సువాడకు తీసుకెళ్లారన్నారు. అక్కడ ఓ స్కూల్ వద్ద కూర్చొబెట్టి వివరాలు అడిగారన్నారు. తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించి బిచ్కుంద జడ్జి ఎదుట హాజరు పర్చి జైలుకు తరలించారన్నారు. తానే స్టేషన్‌కు వెళితే, అరెస్ట్చేశామని చూపడం సమంజసం కాదన్నారు. కేసులో అక్రమంగా అరెస్ట్‌చేసిన విషయంపై ఐజీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.