
- సేంద్రియ మార్కెట్ ఏర్పాటుపై విస్తృత ప్రచారం కల్పించాలి
- సేంద్రీయ మార్కెట్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు : వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించాలని, సేంద్రీయ ఉత్పత్తుల వాడకం ఆరోగ్యకరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శుక్రవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి కేఎంసీ పరిధి 55వ డివిజన్ బ్యాంక్ కాలనీలో ఆయన పర్యటించారు. మున్సిపల్ సాధారణ నిధులు 39.25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 54వ డివిజన్ వీడీఓస్ కాలనీలో ఏర్పాటు చేసిన సేంద్రీయ మార్కెట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రసాయనాలు, పురుగుల మందు వాడకుండా సహజ వనరులను ఉపయోగించి సాగు చేసిన ఆహారపు ధాన్యాలువినియోగదారులకు తక్కువ ధరలకు ఒకేచోట అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో సేంద్రియ మార్కెట్ ను ఏర్పాటు చేశామన్నారు. పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన సేంద్రీయ రైతు మార్కెట్ నందు ప్లాస్టిక్ కవర్లు వాడకం నిషేధించామని, ఇక్కడ జూట్ కవర్లు, బట్ట సంచులు అమ్మడానికి మహిళా సమాఖ్య కోసం ఒక స్టాల్ కేటాయించామని తెలిపారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు కూడా ఇక్కడ అమ్ముకునేలా చూడాలన్నారు.రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకుని, మట్టికి తగిన విధంగా సాగు చేయాలని సూచించారు.
ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.51 వేలు సబ్సిడీ అందిస్తామని చెప్పారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవీ మధుసూదన్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, అగ్రి హార్టికల్చర్ అధికారులు ఉన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీడబ్ల్యూయూసీ ఆహ్వానిత సభ్యుడు, ఏఐసీసీమాజీ కార్యదర్శి, ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ చల్ల వంశీ చందర్ రెడ్డిని మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు.