భక్తులకు ఈజీగా దర్శనం కల్పించాలి : ఈవో భవానీ శంకర్

భక్తులకు ఈజీగా దర్శనం కల్పించాలి : ఈవో భవానీ శంకర్
  • యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో, ఐఏఎస్ అధికారి భవానీ శంకర్ ఆదేశించారు. ఆదివారం యాదగిరిగుట్టపైన ఉచిత దర్శన క్యూలైన్లు, డార్మెటరీ హాల్, వ్రత మండపం, అన్నప్రసాద కేంద్రం, ప్రసాద విక్రయ కౌంటర్, తయారీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.

మిషనరీ ద్వారా ప్రసాదం తయారీ చేస్తున్న నేపథ్యంలో.. టెక్నికల్ పరంగా, సేఫ్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రసాదం కోసం భక్తులు ఎక్కువ టైం క్యూలైన్లలో వెయిట్ చేయకుండా తొందరగా టికెట్లు, ప్రసాదం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సదుపాయాలతో పాటు భద్రత కల్పించడమే ధ్యేయంగా ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో నవీన్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.