వైభవంగా దివ్యవిమాన రథోత్సవం

వైభవంగా దివ్యవిమాన రథోత్సవం
  • పాతగుట్టలో నేత్రపర్వంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు 

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధ క్షేత్రమైన పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజైన ఆదివారం రాత్రి దివ్యవిమాన రథోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల అర్చకత్వంలో అర్చక బృందం కనులపండువగా నిర్వహించారు. మొదట రకరకాల పూలు, ప్రత్యేక లైట్లతో రథాన్ని దివ్యమనోహరంగా అలంకరించడంతో.. దేదీప్యమానంగా వెలుగొందుతున్న రథంలో కల్యాణమూర్తులను అధిష్టింపజేసి రథాంగ హోమం పూజలను చేపట్టారు.

శనివారం రాత్రి ఆండాళ్ అమ్మవారిని పెండ్లాడిన నారసింహుడిని.. ఆదివారం దివ్యమనోహరంగా ముస్తాబు చేసి దివ్యరథంలో అధిష్టింపజేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 గంటలకు మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. మహిళల కోలాట నృత్యం రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం గరుడ వాహన సేవను ఆలయ అర్చకులు నయనానందకరంగా జరిపించారు. ఉదయం గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో స్వామి వారు  విహరించారు. నూతన దంపతులైన లక్ష్మీనృసింహులను దర్శించుకున్న భక్తులు
 పరవశులయ్యారు.