
Trump Tariffs on India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదురు మాట్లాడితే సుంకాలు వేస్తూ నోరు మూయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కెనడా, బ్రెజిల్ వంటి దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు రాగి దిగుమతులపై 50 శాతం, ఫార్మా ఉత్పత్తులను కూడా టార్గెట్ చేయటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే ఫిలిప్పీన్స్, మోల్డోవా, శ్రీలంక, లిబియాతో సహా 7 దేశాల వస్తువులపై కూడా కొత్త సుంకాలు ప్రకటించబడ్డాయి.
ఈ క్రమంలోనే ట్రంప్ రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, యురేనియం కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం వరకు టారిఫ్స్ ప్రకటించాలని చూస్తున్నారు. ఇప్పటికే రష్యా నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ట్రంప్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తే ప్రధానంగా భారత్, చైనాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే అమెరికా మాటలు లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై తన యుద్ధాన్ని కొనసాగిస్తున్న తరుణంలో దానిని ముగించేందుకు ట్రంప్ ఇలాంటి మార్గాలను ఆర్థికంగా రష్యాను దెబ్బతీసేందుకు ప్రయోగించాలని చూస్తున్నారని తేలింది.
సెనేటర్ లిండ్సే గ్రాహం వంటి ప్రముఖులు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేయడానికి దోహదపడతాయన్నారు. ప్రపంచ దేశాలు రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయటం.. ఉక్రెయిన్‌కు అండగా నిలవకపోవటం వంటి చర్యలు అమెరికాతో వ్యాపారాన్ని ఖరీదుగా మారుస్తుందని ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రంప్ తన నిర్ణయం విషయంలో ముందుకు సాగాలని, వెనక్కి తగ్గకూడదని కూడా ఆయన సూచిస్తున్నారు.
ALSO READ : Gold Rate: శనివారం భారీగా పెరిగిన గోల్డ్.. రూ.4వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ తాజా రేట్లివే..
ఇప్పటికే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటి ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కొనుగోలు కొనసాగిస్తు్న్నాయి. రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ యూరోపియన్ దేశాలు, భారత్, చైనాలు వ్యాపారాన్ని కొనసాగించటం అమెరికాకు ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలు అమెరికాలో తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే 500 శాతం వరకు పన్నులు చెల్లించాల్సి వచ్చేలా ట్రంప్ ప్రభుత్వం యోచించటం కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఆగస్టు 1, 2025 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.