
చండ్రుగొండ,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అబివృద్ధి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేందుకు గిరిజన కుటుంబాలకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు ఆఫీసర్ జనరల్ డేవిడ్ రాజు తెలిపారు. శుక్రవారం బెండాలపాడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు ద్వారా రూ.6 లక్షలతో నిర్మించిన సోలార్ విద్యుత్ ప్యానల్, బోర్ల ను ఆయన పరిశీలించారు. అనంతరం గుర్రాయిగూడెం పంచాయితీ ఆఫీసులో జరిగిన ధర్తీ అభాజాన్, జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ సదస్సులో మాట్లాడారు.
సురక్షయోజన, జనశక్తి యోజన, ఆధార్ కార్డ్, పీఎం జన్మన్, కేవైసీ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్లు గ్రామసభలు నిర్వహించి అర్హులైన గిరిజనులకు అందజేస్తామన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయుష్మాన్ భవ కార్డు తీసుకున్న వారు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ద్వారా వైద్య చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ కో జీఎం అజయ్, ఏపీఎం సంతోష్, సోలార్ పంపుసెట్ కంపెనీ యజమానులు, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్లు, వివిధ బ్యాంకుల ఆపీసర్లు, దిశ కమిటీ సభ్యులు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.