O Bhama Ayyo Rama Review : 'ఓ భామ.. అయ్యో రామ' రివ్యూ.. అంచనాలు అందుకోలేకపోయిన సుహాస్ చిత్రం!

O Bhama Ayyo Rama Review : 'ఓ భామ.. అయ్యో రామ' రివ్యూ.. అంచనాలు అందుకోలేకపోయిన సుహాస్ చిత్రం!

సుహాస్... విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు. 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి విజయాలతో తనదైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న సుహాస్ ( Suhas), తాజాగా 'ఓ భామ.. అయ్యో రామ' ( O Bhama Ayyo Rama)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచీ మిశ్రమ స్పందనను ఎదుర్కొంటోంది. 'ఉప్పుకప్పురంబు'తో ఓటీటీలో మెప్పించిన సుహాస్, థియేటర్లలో ఈ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రముఖ దర్శకులు హరీశ్‌ శంకర్, మారుతి వంటి వారు అతిథి పాత్రల్లో కనిపించడం, టీజర్, ట్రైలర్‌లు వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ 'ఓ భామ.. అయ్యో రామ' ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సుహాస్‌కు ఇది మరో విజయంగా నిలిచిందా? చూద్దాం.,. 

ఈ 'ఓ భామ.. అయ్యో రామ' చిత్రంలో   సుహాస్‌, మాళవిక మనోజ్‌, అనిత హస్నా నందిని, అలీ, రవీందర్‌ విజయ్‌, ప్రభాస్‌ శ్రీను, రఘు, పృథ్వీరాజ్‌ తదితరులు నటించారు.   దర్శకుడు రామ్ గోదల దర్శకత్వం వ్యవహరించగా నిర్మాతగా హర్ష నల్ల  తెరకెక్కించారు.,  సంగీతం రథన్‌ అందించగా, సినిమాటోగ్రఫీ ఎస్‌ మణికందన్‌, ఎడిటింగ్‌ భవిన్‌ ఎం షా పని చేశారు.

కథా నేపథ్యం: తల్లి జ్ఞాపకాలు, ఒక కొత్త బంధం
ఈ చిత్రంలో రామ్ (సుహాస్) తల్లి (అనిత హస్నా నందిని) ఒక నృత్యకారిణి. తన భర్త మోసగించాడని తెలుసుకున్న ఆమె, చిన్నతనంలోనే తన కొడుకు రామ్‌తో కలిసి ఇంటిని వదిలేస్తుంది. కొంతకాలానికి ఆమె కన్నుమూయడంతో, రామ్‌ను అతని మేనమామ అలీ చేరదీసి పెంచుతాడు. ఒక రోజు అనుకోకుండా జరిగిన ఒక చిన్న ప్రమాదం రామ్ జీవితంలోకి సత్యభామ (మాళవిక మనోజ్‌) ను తీసుకొస్తుంది. తాగిన మత్తులో ఉన్న సత్యభామను జాగ్రత్తగా ఆమె ఇంటి వద్ద దిగబెడతాడు రామ్. అతని నిజాయితీ, మంచితనం నచ్చిన సత్యభామ అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే, రామ్‌కు సినిమాలంటే అస్సలు ఇష్టం లేని రామ్‌ను సత్యభామ దర్శకుడు హరీశ్‌ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేర్చుతుంది. సత్య జీవితంలోకి వచ్చాక రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది దీని కథాంశం..

ALSO READ : ఓజీ ఫైరింగ్ పూర్తి... సెప్టెంబర్ 25న రిలీజ్ కి రెడీ..

అంచనాలను అందుకోలేకపోయిన రచన, దర్శకత్వం
 'ఓ భామ.. అయ్యో రామ' ట్రైలర్‌ చూసినప్పుడు, దీనిలోనూ ఒక ఆసక్తికరమైన కథ ఉంటుందనిపించింది. మారుతి, హరీశ్‌ శంకర్‌ వంటి ప్రముఖ దర్శకులు అతిథి పాత్రల్లో కనిపించడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, సినిమా చూశాక ఆ అంచనాలు ఆవిరయ్యాయని చెప్పొచ్చు. "తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా.. అన్నీ ఉండాలి" అంటూ దర్శకుడు రామ్‌ గోదల సినిమాలో చెప్పిన డైలాగ్, తన సొంత చిత్రానికి ఎందుకు వర్తించలేదనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.. క్లైమాక్స్‌ను ఒక చిన్న ట్విస్ట్‌తో ముగించే ప్రయత్నం చేసినా, అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరోయిన్ పాత్ర మినహా మిగతా ఏ పాత్రకూ సరైన ప్రాధాన్యత లభించలేదని చెప్పుకొస్తున్నారు..  

 సుహాస్ మరోసారి నిరూపించుకున్నాడా?
రామ్ పాత్రలో సుహాస్, సత్యభామ పాత్రలో మాళవిక మనోజ్ తన నటనకు పూర్తి న్యాయం చేశాడు. చాలా సెటిల్డ్‌గా, పాత్ర మూడ్‌కి తగ్గట్లుగా అతను కనిపించాడు.  సత్యభామగా మాళవిక మనోజ్‌ తన పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో కాస్త ఉపశమనం కలిగించిన పాత్ర ఆమెదే. సుహాస్ తల్లిగా అనిత హస్నా నందిని ఉన్నది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంది. హీరో మేనమామగా అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకులు మారుతి, హరీశ్‌ శంకర్‌ అతిథి పాత్రలు అభిమానులను అలరిస్తాయి. 

పెద్దగా చెప్పుకోదగ్గ పాటలు లేకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. రథన్‌ అందించిన సంగీతం, ఎస్‌ మణికందన్‌ ఛాయాగ్రహణం ఓకే అనిపిస్తాయి.  నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. భవిన్‌ ఎం షా ఎడిటింగ్ మరింత దృష్టి పెడితే బాగుంటుందన్న అభిప్రాయం సగటు ప్రేక్షకుల్లో నెలకొంది. దర్శకుడు రామ్‌ గోదల ఎంచుకున్న కథ బాగున్నా, కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా స్థాయి పెరిగేదంటున్నారు.. 

సుహాస్ ప్రయోగాల ఖాతాలో మరో సినిమా!
మొత్తంగా, 'ఓ భామ.. అయ్యో రామ' సుహాస్ ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుంది. అతని నటన, మాళవిక గ్లామర్ ఉన్నప్పటికీ, బలమైన కథనం, ఎమోషన్స్ లేకపోవడం సినిమాకు పెద్ద లోపంగా నిలిచిందని టాక్.. సుహాస్ గత విజయాలతో పోలిస్తే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని చెప్పాలి. భారీ అంచనాలతో కాకుండా, ఒక మామూలు వినోదం కోసం చూస్తే నిరాశ కలగకపోవచ్చు. అయితే, సుహాస్ లాంటి నటుడి నుండి ప్రేక్షకులు ఇంకొంచెం కొత్తదనం, బలమైన కథను ఆశిస్తున్నారు.