
హనుమకొండ సిటీ/ గ్రేటర్వరంగల్, వెలుగు: హనుమకొండ టీబీ హాస్పిటల్ తోపాటు మెటర్నిటీ ఆస్పత్రిని కలెక్టర్ స్నేహ శబరీశ్ శుక్రవారం ఆకస్మికంగా విజిట్ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ప్రజలకు నిర్వహిస్తున్న ఎక్స్ రే, ఇతర టెస్టులను పరిశీలించి, వివరాలు ఆరా తీశారు. ఒక్కరే రేడియోగ్రాఫర్ ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అక్కడి డాక్టర్లు చెప్పగా పీహెచ్సీలలో ఎక్కడైనా రేడియోగ్రాఫర్ ఉంటే వెంటనే టీబీ ఆస్పత్రికి డిప్యూటేషన్ ఇవ్వాలని డీఎంహెచ్వో అప్పయ్యను ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఉన్న డయాగ్నొస్టిక్ విభాగాన్ని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, టీహబ్ మేనేజర్ కౌముది తదితరులున్నారు.