ఫీజు బాకీ ఉందని.. టీసీ ఇచ్చేందుకు ప్రామిసరీ నోటు రాయించుకున్న డిగ్రీ కాలేజీ !

ఫీజు బాకీ ఉందని.. టీసీ ఇచ్చేందుకు ప్రామిసరీ నోటు రాయించుకున్న డిగ్రీ కాలేజీ !

శివ్వంపేట, వెలుగు: ఫీజు బాకీ ఉండడంతో టీసీ ఇచ్చేందుకు ఓ డిగ్రీ కాలేజీ యాజమాన్యం స్టూడెంట్‌‌తో ప్రామిసరీ నోట్‌‌ రాయించుకుంది. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా నర్సాపూర్‌‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలోని టిక్యాదేవమ్మ గూడ తండాకు చెందిన లూనావత్‌‌ శ్రీరామ్‌‌నాయక్‌‌ గతేడాది నర్సాపూర్‌‌ పట్టణంలోని ఎల్లంకి డిగ్రీ కాలేజీలో ఫస్ట్‌‌ ఇయర్‌‌లో చేరాడు. ఈ సంవత్సరం ఎంసెట్‌‌ రాయగా.. బీటెక్‌‌ సీటు వచ్చింది. దీంతో టీసీ ఇవ్వాలని డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించాడు.

అయితే రూ. 8 వేల ఫీజు బాకీ ఉందని అది పూర్తిగా చెల్లిస్తేనే టీసీ ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో శ్రీరామ్‌‌నాయక్‌‌  రూ.2 వేలు చెల్లించి.. మిగతా రూ. 6 వేలు త్వరలోనే ఇస్తానని ప్రస్తుతం టీసీ ఇవ్వాలని కోరాడు. పెండింగ్‌‌లో ఉన్న రూ. 6 వేలకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్‌‌ చేసింది. దీంతో చేసేదేమీ లేక స్టూడెంట్‌‌ శ్రీరామ్‌‌నాయక్‌‌, అతడి తండ్రి రవినాయక్‌‌ కలిసి రూ. 6 వేలు అప్పు ఉన్నట్లు ప్రామిసరీ నోటు రాసిచ్చారు. ఆ తర్వాతే కాలేజీ యాజమాన్యం శ్రీరామ్‌‌నాయక్‌‌కు టీసీ ఇచ్చింది. అయితే ఈ విషయం కాస్తా బయటకు తెలియడంతో కాలేజీ తీరుపై పలువురు మండిపడుతున్నారు.